వైఎస్సార్ కడప జిల్లాకు శుభవార్త. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు మళ్ళీ జోరు వచ్చింది. జిల్లాలోని సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సంస్థ ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే 1100 ఎకరాల భూమిని సంస్థకు కేటాయించిన ప్రభుత్వం.. తాజాగా విద్యుత్, నీరు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ప్లాంట్‌ను రెండు దశల్లో నిర్మించనున్నారు.
మొదటి దశలో రూ.4,500 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభం కానుండగా,
రెండో దశకు రూ.11,850 కోట్లు వెచ్చించనున్నారు.
2026 జనవరి నాటికి మొదటి దశ పనులు ప్రారంభించాలి,
2026 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
2029 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభం,
2034 ఏప్రిల్ నాటికి రెండో దశ ఉత్పత్తి ప్రారంభం కావాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
ఈ ప్లాంట్ ద్వారా 3,200 మందికి ప్రత్యక్షంగా, 25,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నట్లు అంచనా. 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
మొత్తంగా మూడు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించబోయే ఈ ప్లాంట్ ప్రాంత అభివృద్ధికి కొత్త దిక్సూచి కానుంది. 2023లో JSW సంస్థ భూమి పూజ చేసిన తర్వాత తాజా అనుమతులు రావడంతో నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభం కావనున్నాయి.