ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లా రాంబిల్లి ఫేజ్-2లో లారెస్ ఫార్మా సంస్థకు 531 ఎకరాల భూమిని కేటాయించింది.
లారెస్ సంస్థ ఈ భూమిలో మూడు విడతలుగా ఫార్మా జోన్‌ను అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం సంస్థ మొత్తం రూ.5,630 కోట్ల మేర భారీ పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది.
ఈ ఫార్మా జోన్ ప్రాజెక్టు అమలుతో దాదాపు 6,350 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కలిగే అవకాశం ఉంది. ప్రథమ దశ పనులను 2029 ఏప్రిల్ నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మొత్తం మూడుఫేజుల పనులు 2033 నాటికి పూర్తి కావచ్చని సంస్థ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ఓ కీలక మైలురాయిగా నిలవనుంది. దీనివల్ల మెడికల్, ఫార్మాస్యూటికల్ రంగాలలో మరిన్ని పెట్టుబడులు ప్రవేశించేందుకు అవకాశం ఏర్పడనుంది.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        