ప్రస్తుతం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తూనే ఉన్నాయి. చల్లని గాలి, మబ్బుల ఆకాశం... ఇలాంటి రాత్రి వేళ ఏదో వేడి వంట తినాలనే మనసు తపన పడినప్పుడు, సులభంగా, త్వరగా వండదగిన వంటకాల్లో ఫ్రైడ్ రైస్ ఒక ఉత్తమ ఎంపికగా మారుతుంది.
కార్తీక మాసంలో కొంతమంది నాన్-వెజ్ ప్రియులు ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ వంటివి తినలేకపోయినా, పనీర్ పుదీనా ఫ్రైడ్ రైస్ ఒక ప్రత్యేకమైన ఎంపికగా నిలుస్తుంది. ఇది ఇంట్లోనే హోటల్ లాంటి రుచితో, తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
అన్నం, పనీర్, నూనె, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పసుపు, ఉప్పు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చినచెక్క, మిరియాల పొడి, ధనియాల పొడి, పుదీనా, నిమ్మరసం.
తయారీ విధానం:
ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా తరిగి సిద్ధం చేసుకోవాలి.
పనీర్‌ను చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
మసాలా పేస్ట్ తయారీ: అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి.
అన్నాన్ని 2 కప్పుల పరిమాణంలో ఉడికించి సిద్ధం చేయాలి. (బియ్యం గింజలు విడివిడిగా ఉండేలా వండాలి).
వంట ప్రక్రియ:
స్టవ్‌పై పాన్ పెట్టి వేడెక్కనివ్వాలి. కొద్దిగా నూనె వేయాలి.
నూనె వేడి అయ్యాక, మసాలా దినుసులు (దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు) వేసి వేగించాలి.
తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగించాలి. (ఉల్లిపాయ లేత గోధుమ రంగులోకి మారాలి).
పసుపు, గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి పచ్చి వాసన పోయేంతవరకు కలపాలి.
ఇప్పుడు పనీర్ ముక్కలు వేసి సున్నితంగా కలపాలి.
చివరగా వండిన అన్నం కలిపి, ఉప్పు సరిచూసుకోవాలి.
లో ఫ్లేమ్‌లో 1-2 నిమిషాలు వేడి అయ్యేవరకు నెమ్మదిగా కలపాలి.చివరిగా నిమ్మరసం చల్లితే... అంతే! వేడి వేడిగా పనీర్ పుదీనా ఫ్రైడ్ రైస్ మీకోసం సిద్ధం.
ఇలా కుటుంబం మొత్తం కలిసి వేడివేడి పనీర్ పుదీనా రైస్‌తో బాల్కనీలో కూర్చొని, కురుస్తున్న మేఘాలను చూస్తూ... చినుకు ఆకు మీద పడుతుంటే ఆ సవ్వడి మనతో మాట్లాడినట్టు అదొక అద్భుతమైన ఫీలింగ్ కలిగిస్తుంది. ఆగండి ఆగండి! ఇక్కడ ఒకటి మర్చిపోయారు.
అదేమిటంటే... రైతా (పెరుగు పచ్చడి) లేదా ఏదైనా చట్నీతో జోడిస్తే, ఈ రుచికి అదనపు మార్గం జోడించినట్టే. నాన్-వెజ్ ప్రియులూ, ఒక్కసారి పన్నీర్‌తో చేసిన ఈ ఫ్రైడ్ రైస్ తింటే 'ఓహో!' అనాల్సిందే! ఇంకెందుకు ఆలస్యం? త్వరగా మీకు ఇష్టమైన వారికి ఈరోజు చేసి పెట్టండి. ఇంట్లోనే హోటల్ లాంటి రుచి అందించగల ఈ ఫ్రైడ్ రైస్ వంటకం రెండు నిమిషాల్లో అందుబాటులో ఉంటుంది.