భారత మాజీ రాష్ట్రపతి, 'మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరుగాంచిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
మన ప్రియతమ మాజీ రాష్ట్రపతి డాక్టర్ కలాంకు వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. దేశ అభివృద్ధిపై ఆయనకు ఉన్న అంకితభావం ఆదర్శప్రాయం. శక్తివంతమైన భారత్ నిర్మాణంలో ఆయన ఆలోచనలు యువతకు నిరంతరం ప్రేరణగా నిలుస్తాయి” అని మోదీ పోస్ట్ చేశారు. కలాం ఒక గొప్ప శాస్త్రవేత్త, దార్శనికుడు మాత్రమే కాదు, ఓ ఆదర్శవంతమైన దేశభక్తుడిగా దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ప్రధాని కొనియాడారు.
ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా స్పందించారు. కలాం జీవితం గొప్ప పోరాటానికి, విజయానికి నిదర్శనమని, భారత్‌ను అణుశక్తిగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర అపూర్వమని నడ్డా తెలిపారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా కలాంకు ఘనంగా నివాళులర్పించారు. కలాం నిరాడంబరత, దేశభక్తి దేశానికే ఆదర్శమని, శాస్త్రవేత్తలతో పాటు విద్యార్థులకు ఆయన ఆలోచనలు ఎప్పటికీ వెలుగునిస్తాయని వ్యాఖ్యానించారు.
2002 నుంచి 2007 వరకు భారత 11వ రాష్ట్రపతిగా సేవలందించిన కలాం, వ్యక్తిత్వంలో నిరుపమానమైన నిష్కళంకతతో ప్రజల మనసుల్ని గెలుచుకున్నారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు నాయకత్వం వహించి ‘అగ్ని’, ‘పృథ్వీ’ వంటి శక్తివంతమైన క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 1998లో జరిగిన పోఖ్రాన్-II అణుపరీక్షలకు ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించారు.
విద్యార్థులతో మమేకమయ్యే కలాం, 2015 జులై 27న షిల్లాంగ్‌లోని ఐఐఎమ్‌లో ప్రసంగిస్తూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రజల రాష్ట్రపతిగా ఆయనకు ఉన్న ప్రత్యేక గుర్తింపు, యువతపై ఆయనకు ఉన్న నమ్మకం ఆయనను మరింత గొప్పగా నిలిపింది.