పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ఏ ఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై నిర్మించగా, దర్శకత్వ బాధ్యతలు ఏ ఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి నిర్వర్తించారు. విడుదలకు ముందు పాటలు, ట్రైలర్లతో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. విడుదల అనంతరం మిక్స్‌డ్ టాక్‌ను రాబట్టింది. అయితే, ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి వంటి ప్రాంతాల్లో మాత్రం ఈ సినిమా రికార్డ్ స్థాయి గ్రాస్ సాధించింది.
ఈ నేపథ్యంలో పవన్ అభిమానుల కోసం ఒక సంతోషకరమైన వార్తను జనసేన పార్టీ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రకటించారు. రాజానగరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో హరిహర వీరమల్లు సినిమాను ఉచితంగా ప్రదర్శించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఫ్రీ షోలు మాత్రం అందరికీ కాకుండా, ప్రత్యేకంగా విద్యార్థుల కోసం మాత్రమే నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని మూడు మండలాల్లోని గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీల్లో చదివే 9వ, 10వ తరగతి విద్యార్థులు, ఇంటర్ మరియు డిగ్రీ చదివే విద్యార్థులకే ఈ అవకాశాన్ని కల్పించారు.
జూలై 27 ఆదివారం, సీతానగరంలోని గీత సినిమాస్‌తో పాటు, కోరుకొండలోని రామకృష్ణ థియేటర్‌లో కూడా ఈ ఫ్రీ షోలు జరుగనున్నాయి. భారతీయ చరిత్ర, సంస్కృతి వంటి అంశాలను ఈ తరం విద్యార్థులకు పరిచయం చేయాలనే సంకల్పంతో ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్టు బలరామకృష్ణ తెలిపారు.
అంతేకాదు, దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్‌లో పనిచేస్తున్న తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం జూలై 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు అంబేద్కర్ ఆడిటోరియంలో హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శించనున్నారు.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన మొదటి చిత్రం కావడంతో.. ఈ సినిమాపై అభిమానుల్లో, సినీ ప్రేమికుల్లో విశేష ఆసక్తి నెలకొంది.