ప్రయాణికులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) తమ కీలక నిర్ణయంతో ప్రయాణదారులకు ఊరట కలిగించింది. ఎక్కువగా ప్రయాణించే బెంగళూరు, విజయవాడ మార్గాల్లో నడిచే బస్సుల్లో టికెట్ ధరలను తగ్గించింది. ఇప్పటికే ప్రయాణ వ్యయం పెరిగిన ఈ రోజుల్లో ఈ రాయితీ నిర్ణయం ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలిగించనుంది.
ప్రస్తుతం వసూలు చేస్తున్న చార్జీలపై 16 శాతం నుంచి 30 శాతం వరకు తగ్గింపు ప్రకటించింది. ఈ తగ్గింపు గరుడ, రాజధాని ఏసీ, లగ్జరీ సూపర్ క్లాస్, లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్/స్లీపర్ బస్సులకు వర్తించనుంది. ఇవి అధిక కంఫర్ట్‌తో ఉండే హైఎండ్ బస్సులు కావడంతో రాయితీ వల్ల పెద్దఎత్తున ప్రయాణికులు లబ్ధి పొందనున్నారు.
ఈ డిస్కౌంట్‌లు ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయని టీజీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాయితీలు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ టికెట్ బుకింగ్‌కి రెండింటికీ వర్తిస్తాయి. అంటే రిజర్వేషన్ కౌంటర్లలోనూ, TGSRTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ల ద్వారా బుక్ చేసుకునే వారికి కూడా ఇది వర్తిస్తుంది.
ఈ నిర్ణయం ప్రధానంగా రాత్రి ప్రయాణాలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది ఏసీ మరియు స్లీపర్ క్లాస్ బస్సులకు వర్తించనుండటంతో, ప్రయాణికులు తక్కువ ధరకు హై కంఫర్ట్ ప్రయాణం చేసే అవకాశాన్ని పొందనున్నారు. దీని ద్వారా ప్రయాణికులలో రహదారి ప్రయాణంపై మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.
విభిన్న రూట్లలో ప్రయాణించనున్న వారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని, ఈ రాయితీని ఉపయోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ కోరుతోంది. ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ చర్య చేపట్టినట్లు సంస్థ పేర్కొంది.