అమెరికాలో డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ నెంబర్ 3023 మియామీకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. విమానం టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ల్యాండింగ్ గేర్‌లో సమస్య తలెత్తింది. దీంతో విమానంలోని బ్యాక్ క్యాబిన్‌లో దట్టమైన పొగలు కమ్మేశాయి. ఈ పొగలతో పాటు మంటలు కూడా కనిపించటంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.
విమానాన్ని వెంటనే రన్‌వేపైనే ఆపివేశారు. అంతేకాకుండా ప్రయాణికులందరినీ అత్యవసర నిష్క్రమణ మార్గాల ద్వారా విమానం నుండి బయటకు పంపించారు. ఈ విమానంలో మొత్తం 173 మంది ఉన్నారు — వీరిలో ప్రయాణికులు మరియు సిబ్బంది కూడా ఉన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనలో ఆరుగురికి స్వల్ప గాయాలు జరిగాయి. వారి చికిత్స కోసం ఒకరిని ఆస్పత్రికి తరలించారు.
విమానంలో పొగలు ఎలా వచ్చాయి? ఎందుకు మంటలు చెలరేగాయి? అన్నదానిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ల్యాండింగ్ గేర్ సంబంధిత సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
అధికారులు, విమానాశ్రయ సిబ్బంది, ఎమర్జెన్సీ సర్వీసులు చురుకుగా స్పందించడంతో భారీ ప్రమాదం తప్పినట్లు చెబుతున్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండడం, సిబ్బంది శీఘ్ర చర్య తీసుకోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది.