ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేకించి దివ్యాంగుల కోటాలో అర్హత లేకుండా పింఛన్లు పొందుతున్న 1.08 లక్షల మందికి గుర్తించి, వారికి ఇచ్చిన బోగస్ సదరం ధ్రువపత్రాలను రద్దు చేయనుంది. అర్హతలు లేకున్నా పింఛన్ పొందుతున్న వారి వివరాలను వైద్య బృందాల సహకారంతో ప్రభుత్వం తనిఖీ చేస్తోంది. ఈ నెల జూలై 25వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త సదరం ధ్రువీకరణ పత్రాలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి.
40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి అసెస్‌మెంట్ రిపోర్ట్ ఇచ్చి, వారి పింఛన్లను రద్దు చేయనున్నారు. అర్హులైన దివ్యాంగులకు మాత్రమే పింఛన్ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని పది పురపాలక సంఘాలు మరియు నగర పంచాయతీల్లో ఉన్న ప్రత్యేక అధికారుల పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఎన్నికలు జరిగే వరకు ఈ ప్రత్యేక పాలన కొనసాగుతుందని పురపాలక శాఖ ప్రకటించింది. ఇప్పటికే ఆమదాలవలస, నరసరావుపేట, పొన్నూరు, కందుకూరు, కావలి, తాడిగడప, చింతలపూడి, పొదిలి, అల్లూరు, బి.కొత్తకోట వంటి పట్టణాల్లో ప్రత్యేక అధికారుల పదవీకాలం ముగియడంతో, కొనసాగింపు నిర్ణయం తీసుకున్నట్టు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.