ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా, మండల, గ్రామాల సరిహద్దులు మరియు పేర్ల మార్పుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా స్పందించింది. స్థానిక ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని, దీనిపై లోతుగా అధ్యయనం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. 

ఈ ఉపసంఘంలో ఏడు మంది మంత్రులు – అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ సభ్యులుగా నియమించబడ్డారు. ఉపసంఘానికి కన్వీనర్‌గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ మంత్రివర్గ ఉపసంఘం, పరిపాలనా సౌలభ్యంతో పాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అనుగుణంగా సరిహద్దుల పునర్నిర్వచనానికి సూచనలు చేయాలని ఆదేశించింది. సరిహద్దులు నిర్ణయించే ముందు భౌగోళిక దూరం, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం, జనాభా లెక్కలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. 

ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభిప్రాయాలు, అభ్యంతరాల ఆధారంగా మార్పులు చేర్పులు జరగాలని పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మరియు సీసీఎల్ఎ శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ ఉత్తర్వులకు సంతకం చేశారు.