ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో శుభవార్తను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో కలిసి వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించేందుకు డ్వాక్రా గ్రూప్ మహిళలకు భారీ రాయితీలతో డ్రోన్లను అందించనుంది. కేంద్రం అమలు చేస్తున్న “నమో డ్రోన్ దీదీ"(NamoDroneDidi) పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించి, వ్యవసాయ పనులను సులభతరం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
ఈ పథకంలో భాగంగా ఒక్కో డ్రోన్ (drone) విలువ సుమారు రూ. 10 లక్షలైనా, మహిళలకు 80 శాతం రాయితీగా రూ. 8 లక్షల సాయం అందజేస్తారు. మిగిలిన రూ. 2 లక్షల్ని బ్యాంకు రుణంగా లేదా స్త్రీ నిధి వంటి స్కీముల ద్వారా పొందే అవకాశం ఉంది. మొదటి దశలో 440 మంది మహిళలకు డ్రోన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఇప్పటివరకు 88 మంది లబ్ధిదారులను SEPR అధికారులు గుర్తించారు.
ఈ డ్రోన్ల వాడకంపై మహిళలకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. 15 కిలోల కంటే తక్కువ బరువు కలిగిన ఈ డ్రోన్లు, బ్యాటరీతో పనిచేస్తూ రైతులకు ఎకరానికి 5–7 నిమిషాల్లో పిచికారీ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ విధంగా మానవ శ్రమను ఆదా చేయడంతో పాటు, రసాయనాల వినియోగాన్ని సైతం సుమారు 10 శాతం తగ్గించవచ్చు. ఇది రైతులకు ఆర్థికంగా కూడా లాభదాయకంగా మారనుంది.
ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళలు ఆర్థికంగా స్వావలంబన కలిగి, వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతికతను అందించడంలో కీలక పాత్ర పోషించగలుగుతారు. మహిళల ఆత్మవిశ్వాసం పెరిగి, వారి జీవన ప్రమాణం మెరుగుపడే అవకాశం ఉండటంతో ఇది సమగ్ర అభివృద్ధికి దారితీసే పథకంగా నిలవనుంది.