ఆంధ్రప్రదేశ్‌లో విద్యా హక్కు చట్టం (RTE) కింద ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న 25% ఉచిత సీట్లకు సంబంధించి ఫీజులు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
స్కూళ్ల మౌలిక సదుపాయాలు, సౌకర్యాల ఆధారంగా ప్రభుత్వమే స్కూళ్లను స్టార్ రేటింగ్‌లు ఆధారంగా వర్గీకరించింది. ఇందులో భాగంగా ఒక్కో స్టార్ ఉన్న స్కూల్‌కు రూ.8,500, రెండు స్టార్లకు రూ.10,000, మూడు స్టార్లకు రూ.11,500, నాలుగు స్టార్లకు రూ.13,000, ఐదు స్టార్ల స్కూల్‌కు రూ.14,500 ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవి విద్యార్థులపై స్కూల్‌లు చేస్తున్న ఖర్చును కూడా పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఏ స్కూల్‌కీ ఐదు స్టార్‌లు లేని కారణంగా, వాటిపై ప్రత్యేకంగా ఫీజులను ఖరారు చేశారు. ఈ డబ్బు నేరుగా స్కూళ్ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం, సెప్టెంబర్‌లో 50% ఫీజు, జనవరిలో మిగిలిన మొత్తం చెల్లించనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉచిత సీట్లకు సంబంధించి ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా, లాటరీ ద్వారా అర్హులైన విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అర్హత కోసం తల్లిదండ్రుల ఆధార్, రేషన్ కార్డు, ఓటరు కార్డు, జాబ్ కార్డు, కరెంట్ బిల్లు, లీసు ఒప్పందం తదితర పత్రాలు అవసరం. అలాగే పిల్లల జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.
IB, CBSE, ICSE, స్టేట్ సిలబస్ ఏ సిస్టమ్ అయినా సరే — అర్హత కోసం పిల్లల వయసు కనీసం ఐదేళ్లు పూర్తై ఉండాలి. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు అర్హులు http://cse.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        