థాయ్‌లాండ్–కంబోడియా సరిహద్దులో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. శుక్రవారం తెల్లవారుజామున రెండో రోజు కూడా ఇరుదేశాల సైన్యాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కంబోడియా దళాలు ఫీల్డ్ ఆర్టిలరీ, బీఎం-21 రాకెట్లు ఉపయోగించి థాయ్ భూభాగంపై దాడులకు దిగాయి. ప్రత్యుత్తరంగా థాయ్ సైన్యం యుద్ధ వ్యూహాల ప్రకారం ఫైటర్ జెట్లతో ప్రతీకారం తీర్చింది.
ఈ ఘర్షణల కారణంగా నాలుగు సరిహద్దు ప్రావిన్స్‌ల నుంచి 100,000 మందికి పైగా ప్రజలను 300 తాత్కాలిక శిబిరాలకు తరలించాల్సి వచ్చింది. ఇప్పటివరకు 14 మంది మృతి చెందగా, వారిలో 13 మంది పౌరులు, ఒక సైనికుడు ఉన్నట్లు థాయ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఐదుగురు థాయ్ సైనికులు ల్యాండ్‌మైన్ పేలుడులో గాయపడినట్లు సమాచారం.
ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో థాయ్‌లాండ్ కంబోడియా రాయబారిని బహిష్కరించింది. మే నెలలో ఒక కంబోడియా సైనికుడు మృతిచెందిన తర్వాత ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. ఈ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయ్యేలా ఏర్పాట్లు జరుపుతోంది.
ఇరుదేశాల మధ్య 800 కిలోమీటర్ల సరిహద్దుపై 2008 నుంచి వివాదం కొనసాగుతున్నది. గతంలో జరిగిన ఘర్షణలతో పోలిస్తే ఈసారి మరింత తీవ్రమైన హింస చోటుచేసుకోవడం ఆందోళనకరం. అయితే, ప్రపంచ దేశాలు తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిస్తూ శాంతికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నాయి.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        