మలేషియా ప్రభుత్వం భారతీయులకు 30 రోజుల పాటు వీసా ఫ్రీ ఎంట్రీ సౌకర్యం కల్పించింది. అయితే, ఈ సౌకర్యం ఉన్నప్పటికీ అనేక మంది భారతీయులు మలేషియా విమానాశ్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని ‘నాట్ టు ల్యాండ్’ (NTL) కేటగిరీలో చేర్చి దేశంలోకి అడుగుపెట్టనివ్వకుండా వెనక్కి పంపిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి.
భారతీయులను వెనక్కి పంపడానికి ముఖ్యమైన కారణాలను మలేషియా హైకమిషన్ వివరించింది.
ప్రయాణానికి తగినంత డబ్బు లేకపోవడం
బస చేసేందుకు సరైన ఆధారాలు (హోటల్ బుకింగ్ మొదలైనవి) చూపించకపోవడం
తిరుగు ప్రయాణానికి కచ్చితమైన విమాన టికెట్ లేకపోవడం
అంతేకాకుండా, వీసా ఫ్రీ పథకాన్ని ఉపయోగించుకుని ఉద్యోగాల కోసం వస్తున్నారని అనుమానం వచ్చినా కూడా వారిని దేశంలోకి అనుమతించడం లేదని తెలిపింది.
ఈ కారణాల వల్ల వెనక్కి పంపించబడిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని మలేషియాకు తీసుకువచ్చిన ఎయిర్‌లైన్ సంస్థే మళ్లీ భారత్‌కు పంపే వరకు వారు ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోతున్నారు. కొన్నిసార్లు ఇది గంటల తరబడి లేదా రోజులు పట్టడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
మరోవైపు, కొందరు మోసపూరిత ఏజెంట్లు ఈ స్కీమ్‌ను అడ్డం పెట్టుకుని అమాయకులను తప్పుదారి పట్టిస్తున్నారని హైకమిషన్ హెచ్చరించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్నారని, ఈ పథకం కేవలం పర్యాటక ప్రయాణాల కోసం మాత్రమేనని స్పష్టం చేసింది.
అందువల్ల, మలేషియాకు వెళ్లే భారతీయులు తప్పనిసరిగా తగినంత డబ్బు, రిటర్న్ టికెట్, బసకు సంబంధించిన ఆధారాలు వెంట ఉంచుకోవాలని, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని హైకమిషన్ సూచించింది.