జనసేన నేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 14వ తేదీన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ప్రసంగించనున్నారు; పిఠాపురం నియోజకవర్గంలో ఈ ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు పిఠాపురం తరలి వచ్చే అవకాశముంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ప్లీనరీ కావడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వస్తారని భావించి అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం నేతలకు పవన్ కల్యాణ్ బాధ్యతలను అప్పగించారు. ఎక్కడా దూరం ప్రాంతం నుంచి వచ్చిన కార్యకర్తలకు, నేతలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి...
అయితే మార్చి 14వ తేదీన జరిగే ప్లీనరీలో పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేసే అవకాశముంది. మొన్నటి ఎన్నికల్లో 21అసెంబ్లీ స్థానాలను,రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి వంద శాతం విజయం సాధించిన జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే దిశగా ఈ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కార్యాచరణను రూపొందించనున్నారని తెలిసింది. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని, పదవులు కూడా వస్తాయని, నామినేటెడ్ పదవుల నుంచి అన్ని పదవులు రావాలంటే నిజాయితీగా, నిక్కచ్చిగా పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేయాలని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా నేతలకు, కార్యకర్తలకు ఒక సందేశం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని చెబుతున్నారు.
కష్టపడిన వారికే పదవులు...
రానున్న పదవుల్లో కష్టపడిన నేతలకే ప్రాధాన్యత ఇస్తామన్న హామీని పవన్ కల్యాణ్ ఇవ్వనున్నారు. మూడు పార్టీలు కలసి పనిచేయాలని, ఇందుకోసం ఇగోలకు పోకుండా, అలాగని పార్టీ ప్రయోజనాలు పణంగా పెట్టకుండా జనంలోకి జెండాను తీసుకెళ్లాలని పవన్ కల్యాణ్ కార్యకర్తలకు సూచించనున్నారు. రాజకీయ భవిష్యత్ చాలా ఉందని, మరో ఇరవై ఏళ్ల పాటు తాను రాజకీయాల్లో ఉంటానని, పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి వారిని గౌరవిస్తామని కూడా పవన్ కల్యాణ్ చెప్పనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ముందుగా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో కార్యకర్తలను నేతలను కలుపుకుని వెళుతూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కోరనున్నారు.
వివాదాలకు గురైన నేతలను...
మరొక వైపు నేతలకు వార్నింగ్ కూడా ఇవ్వనున్నారు. ఎలాంటి వివాదాలకు వెళ్లవద్దని, అలా వెళ్లిన వారిని నిర్దాక్షిణ్యంగా పార్టీకి దూరంగా ఉంచుతామని కూడా పవన్ కల్యాణ్ ఈ ప్లీనరీ ద్వారా హెచ్చరించనున్నారు. అనేక చోట్ల టీడీపీ, జనసేన నేతలకు మధ్య విభేదాలున్నాయన్న విషయాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి, ఏదైనా సమస్యలుంటే పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే తాను నేరుగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అక్కడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్న హామీ కూడా ఇవ్వనున్నారు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు కొందరిపై అప్పుడే ఆరోపణలు వస్తున్నాయని, వాటిని తొలగించుకుని మరోసారి గెలుపునకు ప్రయత్నించాలని కూడా పిలుపునివ్వనున్నారని పార్టీ ముఖ్య నేతలు చెప్పారు. మొత్తం మీద మార్చి 14న పవన్ కల్యాణ్ ప్రసంగంపైనే నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.