కండే నస్ట్ ట్రావెలర్ తాజా కథనం ప్రకారం, ప్రపంచంలో ఉన్న దీవుల సంఖ్య ఆధారంగా అత్యధిక దీవులు కలిగిన దేశాల జాబితా ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తోంది. ఈ కథనం ప్రకారం, దీవుల సర్వేలో ప్రతి దేశం వేరే ప్రమాణాలను పాటిస్తుంది. కొన్ని దేశాలు ఎంత చిన్నదైనా, జలాల మధ్యలో ఉన్న ప్రతి భూభాగాన్ని దీవిగా పరిగణిస్తే, మరికొన్ని కనీస పరిమాణం లేదా తీరం పొడవు ఆధారంగా మాత్రమే లెక్కించబడ్డాయి. ఆధునిక శాటిలైట్ టెక్నాలజీ వాడకంతో గతంలో గుర్తించబడని చాలా చిన్న చిన్న దీవులు కూడా లెక్కలోకి వచ్చాయి.
ఈ సర్వేను WorldAtlas (2020) మరియు World Population Review (2025) నుండి సేకరించబడిన తాజా సమాచారం ఆధారంగా రూపొందించారు. ప్రతి దేశపు అధికారిక భూసర్వేలు, గణాంక విభాగాల సమాచారం, జియోస్పేషియల్ సర్వేలను ఈ డేటా మూలంగా తీసుకున్నారు. వీటిలో సహజ దీవులు మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు... కృత్రిమ దీవులు, జలంలో కరిగిపోయే మట్టిబద్దలు లెక్కించలేదు.
ఈ జాబితాలో 2,67,570 దీవులలో స్వీడన్ అగ్రస్థానంలో ఉంది.. వాటిలో చాలావరకు నివాసం లేని చిన్న చిన్న దీవులే. రెండవ స్థానంలో నార్వే (2,39,057), తదుపరి ఫిన్లాండ్ (1,78,947) ఉన్నాయి. ఈ దేశాల్లోని జలాలు, ఫియోర్డ్‌లు భూభాగాన్ని చాలా భాగాలుగా విభజించాయి. తర్వాత స్థానాల్లో కెనడా, అమెరికా, ఇండోనేషియా, జపాన్, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్, చిలీ ఉన్నాయి. ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ వంటి దేశాలు తీరప్రాంతాలనూ, అగ్నిపర్వత దీవులను కలిగి ఉండటంతో సర్వేలో ఉన్నత స్థానం దక్కించుకున్నాయి.
మొత్తంగా చూస్తే, దీవుల సంఖ్యలో తేడా దేశీయ ప్రమాణాలపై ఆధారపడినప్పటికీ, ఈ గణాంకాలు ప్రపంచ దీవుల భౌగోళిక విభజనపై విశేషమైన అవగాహనను కలిగిస్తున్నాయి. ప్రకృతి వైవిధ్యం, భూభాగాల రూపాంతరం మరియు టెక్నాలజీ వృద్ధి ఈ గణాంకాల రూపకల్పనకు కీలక పాత్ర వహించాయి.