సనాతన ధర్మంపై సినీ నటుడు, రాజకీయ నాయకుడు కమల హాసన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగింది. నిరసనగా కమల్ హాసన్ సినిమాలను బహిష్కరించాలంటూ తమిళనాడు బీజేపీ ప్రజలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర బీజేపీ కార్యదర్శి అమర్ ప్రసాద్ రెడ్డి ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.
"గతంలో ఉదయనిధి స్టాలిన్, ఇప్పుడు కమల్ హాసన్ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. వారికి బుద్ధి చెప్పాలనుకుంటున్నాం. హిందువులంతా కమల్ సినిమాలను బహిష్కరించాలి. థియేటర్‌లో కాదు, ఓటీటీలో కూడా చూడకూడదు. అప్పుడు మాత్రమే వారు వేదికలపై హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం మానుకుంటారు" అని పేర్కొన్నారు.
కమల్ హాసన్ ఇటీవల నటుడు సూర్య నిర్వహిస్తున్న ‘అగరం ఫౌండేషన్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. “దేశాన్ని మార్చగల శక్తి విద్యలోనే ఉంది. నియంతృత్వానికి, సనాతన ధర్మపు సంకెళ్లకు అంతిమ పరిష్కారం విద్యే” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ‘నీట్’ పరీక్షపై కూడా కమల్ ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఇది అణగారిన వర్గాల విద్యార్థులకు అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు.
కమల్ వ్యాఖ్యలపై ఆయనతో కలిసి పనిచేసిన బీజేపీ నేత ఖుష్బూ సుందర్ స్పందిస్తూ.. “విద్యపై కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని ప్రస్తావించడం అసందర్భం. విద్య ప్రాముఖ్యత గురించి మాత్రమే ఆయన మాట్లాడాల్సింది” అని అన్నారు. డీఎంకే ప్రతినిధి ఎ. శరవణన్ మాత్రం కమల్‌ను సమర్థిస్తూ.. “కమల్ హాసన్ వ్యాఖ్యలు లక్ష్యాన్ని బాగా ఛేదించాయి. రైట్ వింగ్ వారు ఆయనపై ఎలా స్పందించాలో తెలియక ఆగ్రహంతో ఉన్నారు” అని వ్యాఖ్యానించారు.