ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఊరట కలిగించే శుభవార్తను కూటమి ప్రభుత్వం ప్రకటించబోతోంది. ఇటీవల ఆర్థికంగా కుదురుకున్న అనంతరం, గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. వాటిలో భాగంగా, చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అలాగే ప్రతి పవర్‌లూమ్ యూనిట్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ పథకం అమలు ద్వారా దాదాపు 93,000 మంది చేనేత కుటుంబాలు మరియు 10,534 పవర్‌లూమ్ యూనిట్లు ప్రయోజనం పొందనున్నాయి.
ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, అంటే ఆగస్టు 7న ప్రారంభించనుంది. ఇప్పటికే అధికారులు పథకానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించినప్పటికీ, ఖజానాలో నిధుల కొరత కారణంగా అమలు ఆలస్యం అయింది. ఇప్పుడేమో ప్రభుత్వం సంపద సృష్టించడంపై దృష్టి పెట్టిన తర్వాత కొంతవరకు ఆర్థిక స్థిరత్వం వచ్చింది. ఫలితంగా, ఈ హామీని అమలు చేసే దిశగా ముందడుగు వేసింది.
ఈ పథకం వల్ల చేనేత రంగానికి నిరంతరంగా ఆర్థిక ఊరట లభించనుంది. విద్యుత్ బిల్లుల భారం తగ్గడం వల్ల కార్మికులు తమ ఉత్పత్తిని మరింత పెంచగలుగుతారు. అయితే ఇది ఒక్క పథకం చాలని కాదు. ఈ పథకంతోపాటు చేనేత వస్త్రాల తయారీకి ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వడం, దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, మరియు ఆన్‌లైన్ మార్కెటింగ్‌ను ప్రోత్సహించడం వంటివి కూడా అవసరం. ఈ చర్యల ద్వారా నేతన్నల జీవితాల్లో వాస్తవికమైన మార్పు తీసుకురావచ్చు.
ప్రభుత్వ అంచనా ప్రకారం, ఈ పథకాన్ని అమలు చేయడానికే ఏడాదికి సుమారు రూ.120 కోట్లు ఖర్చు అవుతుంది. అయినప్పటికీ, ఇది ఒక సరైన పెట్టుబడిగా పరిగణించవచ్చు, ఎందుకంటే భారతీయ చేనేత వస్త్రాలకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. సరైన ప్రోత్సాహం, మార్కెటింగ్, మరియు మద్దతు దొరికితే, రాష్ట్రంలో చేనేత రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశముంది.