ఆంధ్రప్రదేశ్‌లో రవాణా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు ఉన్న 113 కిలోమీటర్ల పొడవు గల ప్రధాన రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ మార్గం రాయలసీమ నుంచి వస్తున్న కూరగాయలు, సరుకుల రవాణాకు కీలకంగా మారనుంది.
ప్రస్తుత రహదారి సన్నకారు కావడంతో, సంతనూతలపాడు, చీమకుర్తి, పొదిలి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా మర్రిచెట్లపాలెం - చీమకుర్తి మార్గం లారీలు, ట్రైలర్ల రాకపోకలతో ప్రమాద ప్రదేశంగా మారింది. దీనికితోడు ఆక్రమణల కారణంగా రోడ్డు మరింత ఇరుకుగా మారింది.
ఈ పరిస్థితులకు పరిష్కారంగా ఒంగోలు నుంచి బేస్తవారిపేట దాకా రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారీ ప్రస్తుతం జరుగుతోంది. అవసరమైన స్థలాన్ని గుర్తించేందుకు సర్వే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సంతనూతలపాడు, పొదిలి వద్ద బైపాస్ రోడ్లు కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యంతో (PPP మోడల్‌లో) చేపట్టనుంది.
ప్రాజెక్టు పూర్తయితే అనంతపురం నేషనల్ హైవేతో కలుపుతూ మరింత విస్తృత రవాణా జాలం ఏర్పడనుంది. డీపీఆర్ పూర్తయిన తర్వాత ఖర్చు, భూ సేకరణ వివరాలు తేలనున్నాయని అధికారులు తెలిపారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        