చైనాలో భారీ వర్షాలు, వరదలు అంతుపట్టని విధంగా ప్రజల్ని వణికిస్తున్నాయి. రాజధాని బీజింగ్ సహా పలువురు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ విపత్కర పరిస్థితుల వల్ల ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. వరదల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సుమారు 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
మియున్ జిల్లాలో వరదలు తీవ్రంగా విరుచుకుపడటంతో 28 మంది, యాంకింగ్ జిల్లాలో 2 మంది మృతి చెందారు. హెబీ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మరణించారు. లువాన్‌పింగ్ కౌంటీలోని గ్రామీణ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో పలువురు చిక్కుకుపోయారు. జనావాసాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నదుల్లో వరద ప్రవాహం పెరగడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే అక్కడి నుంచి తరలిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు, వరదల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో కొన్ని ప్రాంతాలు చీకటిమయం అయ్యాయి.
ఈ బీభత్సంపై స్పందించిన చైనా ప్రధాని లి క్వియాంగ్, వరదల వల్ల తీవ్రమైన నష్టం వాటిల్లిందని తెలిపారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.