అమెరికా వీసా విధానంలో త్వరలోనే భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. 2025 సెప్టెంబర్ 2 నుంచి వీసా ఇంటర్వ్యూలకు మినహాయింపు (Interview Waiver) విధానాన్ని రద్దు చేయనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు వీసా రీన్యూవల్ చేసుకునే వారిలో పలు వర్గాలపై ఇంటర్వ్యూల మినహాయింపు ఉండేది. అయితే ఇకపై స్టూడెంట్, వర్క్ వీసాల రీన్యూవల్ కోసం తప్పనిసరిగా తిరిగి ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఈ మార్పుతో హెచ్-1బీ వీసాదారులు, వారి కుటుంబ సభ్యులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 2 తర్వాత ఇప్పటికే అపాయింట్‌మెంట్లు తీసుకున్నవారిపై అస్పష్టత నెలకొంది. పాత విధానంలో వారు ఇంటర్వ్యూకు హాజరుకావలసిన అవసరం లేకుండా వీసా రీన్యూవల్ చేయగలిగారు. కానీ ఇప్పుడు ఆ మినహాయింపు రద్దుతో తిరిగి కొత్త అపాయింట్‌మెంట్ తీసుకోవాలా? లేక పాతదే సరిపోతుందా అన్న సందేహాలు పెరిగాయి.
ఇంతకుముందు కొవిడ్ సమయంలో వీసా బ్యాక్‌లాగ్ తగ్గించేందుకు ఈ వీసా *waiver policy* విస్తరించారు. కానీ ఇప్పుడు ట్రంప్ పాలనకు అనుగుణంగా కఠిన నియమాలను పునరుద్ధరించే దిశగా ఈ మార్పులు జరిగాయి. అంతేకాదు, ప్రస్తుతం కన్సులేట్ అధికారులతోపాటు ఎయిర్‌పోర్ట్‌ల వద్ద కూడా ప్రయాణికులపై క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. బయోమెట్రిక్ వివరాలు, అవసరమైతే అరెస్టు రికార్డులకు సంబంధించిన వివరాలు కూడా అడుగుతున్నారు.
ఈ మార్పులతో వీసా రీన్యూవల్ ప్రక్రియ మరింత కఠినతరం కానుందని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా విద్యార్ధులు, ఉద్యోగులుగా అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులకు ఇది పెద్ద మైనస్‌గా మారే అవకాశం ఉంది. భారత పాస్‌పోర్టు హోల్డర్లకు ఇప్పటికే పలు దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ ఉన్నప్పటికీ, అమెరికా వలస విధానాలు మాత్రం మరింత కఠినతరం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.