విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా వచ్చే కొన్ని వారాల పాటు అనేక రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. జూలై 23 నుంచి 29వ తేదీ వరకు, ఆగస్టు 6 నుంచి 24వ తేదీ వరకు మొత్తం 53 రైళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా రద్దయ్యాయి. అదేవిధంగా మరో 50 రైళ్లను దారి మళ్లించారు. కొన్ని రైళ్ల షెడ్యూల్ సమయాలను క్రమబద్ధీకరించగా, నాలుగు రైళ్లను రీషెడ్యూల్ చేశారు.
రద్దైన ముఖ్యమైన రైళ్లు:
విజయవాడ నుంచి ఒంగోలు, తెనాలి, బిట్రగుంట, గుంటూరు, రేపల్లె, గూడూరు, సికింద్రాబాద్, తిరుపతి, లింగంపల్లి, నరసాపురం, రేణిగుంట, కాకినాడ, ఆదిలాబాద్, విశాఖపట్నం, తుగ్లకాబాద్, పటేల్ నగర్, జల్నా, చర్లపల్లి మార్గాల్లో రైళ్లు పూర్తిగా/పాక్షికంగా రద్దయ్యాయి.
దారి మళ్లించిన రైళ్లు:
షాలిమార్-చెన్నై, హౌరా-బెంగళూరు, నిజాముద్దీన్-ఎర్నాకుళం, జోధ్‌పూర్-చెన్నై, అయోధ్య-రామేశ్వరం, ఖరగ్‌పూర్-విల్లుపురం, సంత్రగచ్చి-మంగళూరు, గయా-చెన్నై, గోరఖ్‌పూర్-కొచ్చువేలీ, మధురై-చండీఘర్, తిరుపతి-భువనేశ్వర్ తదితర రైళ్లను తాత్కాలికంగా వేరే మార్గాల్లో నడిపిస్తున్నారు.
ఇంకా మార్పులు ఉన్న రైళ్లు:
భగత్ కీ కోటీ-చెన్నై, కన్యాకుమారి-దిబ్రూఘర్, ఎర్నాకులం-హౌరా, బెంగళూరు-న్యూ తిన్ సుఖియా, విశాఖ-లింగంపల్లి, త్రివేండ్రం-సికింద్రాబాద్, పుదుచ్చేరి-కాకినాడ, హైదరాబాద్-కొల్లం వంటి అనేక రైళ్ల రాకపోకల్లో మార్పులు ఉన్నాయి.
ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునే ముందు ఈ మార్పులను తప్పకుండా పరిశీలించాలని, తదనుగుణంగా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.