ప్రపంచ ఈ-కామర్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న అమెజాన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రకటించిన 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా, వచ్చే వారం నుంచే రెండో విడత లేఆఫ్స్‌ను ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ దశలో దాదాపు 15,000 మందికి పైగా ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో చేపట్టిన తొలగింపులకు కొనసాగింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ తాజా లేఆఫ్స్ ప్రభావం అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), రిటైల్ బిజినెస్, ప్రైమ్ వీడియో, అలాగే హ్యూమన్ రిసోర్సెస్ విభాగం అయిన ‘పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ’పై ఎక్కువగా పడనుందని అంచనా. అయితే, పరిస్థితులను బట్టి ప్రణాళికల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని సంస్థకు చెందిన వర్గాలు చెబుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో అమెజాన్ దాదాపు 14,000 మంది ఉద్యోగులను తొలగించింది. వారికి ఇచ్చిన 90 రోజుల నోటిస్ పీరియడ్ సోమవారంతో ముగియనుండటంతో, మంగళవారం నుంచే కొత్త లేఆఫ్స్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
గత ఉద్యోగాల కోత సమయంలో కంపెనీ అంతర్గతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరణే ప్రధాన కారణమని చెప్పుకొచ్చింది. అయితే, తాజా నిర్ణయంపై స్పందించిన అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ మాత్రం ఇది ఆర్థిక మాంద్యం లేదా ఏఐ ప్రభావం వల్ల తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు. సంస్థలో పెరిగిపోయిన బ్యూరోక్రసీ, అనవసరమైన మేనేజ్మెంట్ లేయర్లు, నిర్ణయ ప్రక్రియను నెమ్మదింపజేసే వ్యవస్థలను తగ్గించడమే ఈ చర్య వెనుక అసలు లక్ష్యమని ఆయన వివరించారు. కంపెనీని మరింత చురుకుగా, సమర్థవంతంగా మార్చడానికే ఈ మార్పులు చేస్తున్నామని జెస్సీ తెలిపారు.
మొత్తం 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగుల తొలగింపు పూర్తయితే, ఇది అమెజాన్ మూడు దశాబ్దాల చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్స్‌గా నిలవనుంది. 2022లో సుమారు 27,000 మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్, ఇప్పుడు ఆ సంఖ్యను దాటనుంది. అయితే, సంస్థలో ప్రస్తుతం దాదాపు 15.8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, కార్పొరేట్ లేఆఫ్స్ మొత్తం ఉద్యోగుల్లో కేవలం 10 శాతం వరకే ఉంటాయని కంపెనీ స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ, టెక్ రంగంలో కొనసాగుతున్న ఉద్యోగాల అనిశ్చితికి ఇది మరో సంకేతంగా మారింది.