ప్రయాణం సుఖమయం అని భావించే విమాన ప్రయాణంలో ఒక్కోసారి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇటీవలే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి వద్ద ప్రమాదానికి గురైన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇలాంటి విమాన ప్రమాదాలు జరిగినప్పుడు లేదా సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు "ఎమర్జెన్సీ ల్యాండింగ్" అనే పదం మనం తరచూ వింటుంటాం. అసలు విమానాన్ని అత్యవసరంగా ఎప్పుడు దింపుతారు? ఆ సమయంలో వేగం ఎంత ఉంటుంది? పైలట్లు అనుసరించే వ్యూహాలేంటి? అనే విషయాలను తెలుసుకుందాం..
అత్యవసర ల్యాండింగ్ ఎప్పుడు అవసరం?
విమానం గాలిలో ఉన్నప్పుడు ప్రయాణికుల భద్రతే ప్రథమ ప్రాధాన్యత పైలట్లు ప్రతి చిన్న సమస్యను నిశితంగా గమనిస్తారు. సాధారణంగా కింది పరిస్థితుల్లో అత్యవసర ల్యాండింగ్ నిర్వహిస్తారు:
సాంకేతిక లోపాలు: ఇంజిన్ ఫెయిల్యూర్, ల్యాండింగ్ గేర్ మొరాయించడం లేదా ఎలక్ట్రికల్ సిస్టమ్ పని చేయకపోవడం.
ఇంధన సమస్యలు: ఇంధనం లీక్ అవ్వడం లేదా గమ్యస్థానానికి చేరుకోవడానికి సరిపడా ఇంధనం లేకపోవడం.
క్యాబిన్ ప్రెజర్: విమానం లోపల గాలి ఒత్తిడి (Air Pressure) అకస్మాత్తుగా తగ్గిపోయినప్పుడు ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా వెంటనే కిందకు దిగాల్సి ఉంటుంది.
వైద్య అత్యవసరాలు: ప్రయాణికుల్లో ఎవరికైనా తీవ్రమైన గుండెపోటు లేదా ఇతర ప్రాణాపాయ స్థితి తలెత్తినప్పుడు.
వాతావరణ పరిస్థితులు: ఊహించని తుఫానులు లేదా గాలి మళ్లింపు వల్ల రన్‌వే సరిగ్గా కనిపించనప్పుడు.
ల్యాండింగ్ రకాలు: క్షేమంగా భూమికి చేరే మార్గాలు
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, అత్యవసర ల్యాండింగ్‌లు..
ఫోర్స్డ్ ల్యాండింగ్ : ఇంజిన్ పూర్తిగా ఆగిపోయినప్పుడు, విమానం గాలిలో తేలే సామర్థ్యాన్ని కోల్పోయే లోపే తక్షణమే ఎక్కడో ఒకచోట దింపాల్సి రావడం.
ల్యాండింగ్ : ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందే పసిగట్టి, అప్రమత్తతతో విమానాన్ని సురక్షిత ప్రాంతానికి మళ్లించడం.
డిచ్చింగ్ : విమానం భూమిపై దిగడానికి అవకాశం లేనప్పుడు, సముద్రం లేదా నది వంటి జలభాగాలపై ల్యాండ్ చేయడం. వేగం.. ల్యాండింగ్‌కు కీలక ప్రాణం సాధారణంగా ఒక వాణిజ్య విమానం రన్‌వేపై ల్యాండ్ అయ్యేటప్పుడు దాని వేగం గంటకు 240 నుండి 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే అత్యవసర సమయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది.
అత్యవసర ల్యాండింగ్ సమయంలో పైలట్ వేగాన్ని గంటకు 150 నుండి 200 కిలోమీటర్లకు తగ్గించడానికి ప్రయత్నిస్తారు. వేగం ఎక్కువగా ఉంటే విమానం రన్‌వేను దాటి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఫ్లాప్స్ మరియు ఎయిర్ బ్రేక్‌లను ఉపయోగించి గాలిలోనే వేగాన్ని గరిష్టంగా నియంత్రిస్తారు.
మేడే.. మేడే.. పైలట్ ఏం చేస్తారు?
అత్యవసర పరిస్థితి ఏర్పడగానే పైలట్ రేడియో ద్వారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి "మేడే.. మేడే..మేడే అని మూడుసార్లు సందేశం పంపుతారు. ఇది అంతర్జాతీయ ప్రమాద హెచ్చరిక.
ల్యాండింగ్ సైట్ గుర్తింపు: రన్‌వే అందుబాటులో లేకపోతే ఖాళీ ప్రదేశాలు, హైవేలు లేదా మైదానాలను వెతుకుతారు.
గాలి దిశ: విమానం వేగంగా ఆగాలంటే గాలికి వ్యతిరేక దిశలో ల్యాండ్ చేయడం సాంకేతిక అవసరం.
ప్రయాణికుల భద్రత: క్యాబిన్ సిబ్బంది ప్రయాణికులను "బ్రేస్ పొజిషన్" (తలను మోకాళ్ల మధ్య ఉంచుకోవడం) తీసుకోమని ఆదేశిస్తారు.
తక్షణ స్పందన: విమానం ల్యాండ్ అవ్వగానే అగ్నిమాపక యంత్రాలు మరియు అంబులెన్సులు సిద్ధంగా ఉండి, ప్రయాణికులను ఎమర్జెన్సీ స్లైడ్స్ ద్వారా బయటకు తెస్తారు.
ఏవియేషన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేటి రోజుల్లో అత్యవసర ల్యాండింగ్‌లు విఫలమయ్యే అవకాశాలు చాలా తక్కువ. పైలట్ల సమయస్ఫూర్తి, నిరంతర శిక్షణ వందలాది ప్రాణాలను కాపాడుతున్నాయి.