Health- అది పెద్ద అపోహ.. కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు బీర్ తాగితే డేంజర్!
బీర్ తాగితే రాయి పడదు.. కొత్త రాళ్లు పుడతాయి
సొంత వైద్యం వద్దు: బీర్ తాగితే కిడ్నీ రాళ్లు కరగవు….
Health Tips: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయనే ప్రచారం సమాజంలో విరివిగా సాగుతోంది. నలుగురు స్నేహితులు కలిసినప్పుడో, లేదా కిడ్నీ నొప్పితో ఎవరైనా బాధపడుతున్నప్పుడో 'రోజుకో బీర్ తాగితే రాయి పడిపోతుంది' అంటూ ఉచిత సలహాలు ఇవ్వడం మనం తరచూ చూస్తుంటాం. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి శాస్త్రీయత లేదని, ఇదొక ప్రమాదకరమైన అపోహ మాత్రమేనని ప్రముఖ మూత్రపిండాల వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఇలాంటి సొంత వైద్యాల జోలికి వెళ్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వారు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా బీర్ తాగినప్పుడు శరీరంలో మూత్రం ఉత్పత్తి వేగంగా పెరుగుతుందనే మాట నిజమే. బీర్లో ఉండే కొన్ని రసాయన గుణాలు కిడ్నీలను వేగంగా పనిచేసేలా చేసి, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లేలా ప్రేరేపిస్తాయి. దీనివల్ల మూత్రం ఫోర్స్‌గా వచ్చి లోపల ఉన్న రాయి బయటకు నెట్టబడుతుందని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ, రాయిని బయటకు పంపే క్రమంలో బీర్ వల్ల శరీరం తీవ్రమైన డీహైడ్రేషన్‌కు (నీటి కొరత) గురవుతుందనే నిజాన్ని ఎవరూ గమనించరు. శరీరం ఎండిపోయే కొద్దీ కిడ్నీలపై ఒత్తిడి పెరిగి సమస్య మరింత జటిలంగా మారుతుంది.
ఇక అసలు విషయానికి వస్తే, బీర్ తయారీలో ఉపయోగించే పదార్థాలలో 'ఆక్సలేట్స్' అనే మూలకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం ఈ ఆక్సలేట్లే. ఒకవైపు ఉన్న రాయిని పోగొట్టుకోవడానికి బీర్ తాగుతుంటే, అది రివర్స్ అయి లోపల మరిన్ని కొత్త రాళ్లు పుట్టుకురావడానికి కారణమవుతుంది. అంటే, తాత్కాలిక ఉపశమనం కోసం చేసే ప్రయత్నం భవిష్యత్తులో పెద్ద జబ్బుగా మారే ప్రమాదం ఉంది. పైగా ఆల్కహాల్ అలవాటు లేనివారు కూడా ఈ నెపంతో మద్యపానానికి బానిసలయ్యే ప్రమాదం ఉంది.
మరో ముఖ్యమైన సాంకేతిక విజ్ఞానాన్ని పరిశీలిస్తే, మన శరీరంలో కిడ్నీ నుంచి మూత్రనాళానికి వెళ్లే గొట్టం పరిమాణం కేవలం 3 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఒకవేళ కిడ్నీలో ఉన్న రాయి 5 మిల్లీమీటర్ల కంటే పెద్దదిగా ఉంటే, బీర్ తాగినప్పుడు వచ్చే ఫోర్స్‌కు ఆ రాయి వచ్చి సన్నటి మూత్ర గొట్టంలో ఇరుక్కుపోతుంది. దీనివల్ల మూత్రం పూర్తిగా నిలిచిపోయి, పొత్తికడుపులో తట్టుకోలేనంత తీవ్రమైన నొప్పి వస్తుంది. గొట్టం లోపల గాయాలై ఇన్ఫెక్షన్లు రావడం, లేదా కిడ్నీలు పూర్తిగా వాచిపోయి పాడైపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
అందుకే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నప్పుడు ఇలాంటి అడ్డదారులను నమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచి నీరు తాగడం, ఉప్పు మరియు మాంసాహారాన్ని తగ్గించడం ద్వారా చిన్న సైజు రాళ్లను సహజంగానే కరిగించుకోవచ్చు. రాయి పెద్దదిగా ఉన్నప్పుడు నిపుణులైన డాక్టర్లను సంప్రదించి సరైన మందులు వాడటం లేదా ఆధునిక లేజర్ చికిత్సల ద్వారా వాటిని తొలగించుకోవడమే సురక్షితమైన మార్గం.