ఎబోలా వైరస్‌పై భారత్ అప్రమత్తం.. కట్టుదిట్టమైన నిఘా చర్యలు..
బెంగళూరులో అనుమానితుడికి ఎబోలా నెగటివ్.. ఊపిరి పీల్చుకున్న అధికారులు..
ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాధి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచించింది.
ఇటీవల ఉగాండా నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ వ్యక్తికి స్వల్పంగా ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపించడంతో అతడిని బెంగళూరులోని ప్రభుత్వ అంటువ్యాధుల ఆసుపత్రిలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల కోసం అతడి నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కు పంపగా, పరీక్షల్లో ఎబోలా వైరస్ లేదని తేలింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎబోలా పరిస్థితిని కేంద్ర ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ప్రజారోగ్య చర్యలను మరింత బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అంతర్జాతీయ విమానాశ్రయాలు సహా దేశంలోని అన్ని ప్రవేశ ద్వారాల వద్ద ప్రత్యేక స్క్రీనింగ్, నిఘా చర్యలు కొనసాగుతున్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అనుమానాస్పద లక్షణాలు ఉన్న వారిపై వైద్య పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపింది.
అఫవాహాలు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరింది. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య సమాచారాన్ని పంచుకోవద్దని సూచించింది. పరిస్థితిని ప్రభుత్వం పూర్తిగా నియంత్రణలో ఉంచిందని, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ భరోసా ఇచ్చింది.