కడప జిల్లాలోని పెండ్లిమర్రిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 2024 జనవరి 19న కమలాపురంలో ‘రా కదిలి రా’ కార్యక్రమం కోసం వచ్చినప్పుడు ప్రజల్లో కనిపించిన అదే ఉత్సాహం ఇప్పుడు కూడా కనిపిస్తోందని అన్నారు. కడపలో జరిగిన మహానాడును ప్రజలు విజయవంతం చేసి, అక్కడ టీడీపీ శక్తి ఏంటో నిరూపించారని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై సందేహాలు వ్యక్తమైన్నా, వాటిని ప్రభుత్వం సూపర్ హిట్‌గా అమలు చేసి చూపిందన్నారు. ఇప్పటివరకు 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో ₹14,000 చొప్పున నేరుగా జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల సమస్యలు ఉన్నా, రైతుల పట్ల ఉన్న నిబద్ధతతో నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పంచసూత్రాలు తీసుకువచ్చినట్లు తెలిపారు. రైతులు డిమాండ్ ఆధారిత పంటలు సాగు చేస్తేనే ఆదాయం పెరుగుతుందని, పంటలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధానాన్ని అభివృద్ధి చేయాలన్నారు. పాత పద్ధతుల్లో సాగు చేస్తే రైతుకు ఇబ్బందులు తప్పవని, ఆధునిక పద్ధతులు, ప్రకృతి సేద్యం భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు.
రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నాడు పొత్తు పెట్టుకున్నామని, ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి వేగంగా జరుగుతోందని అన్నారు. తానే రాయలసీమలో పుట్టానని, రాయలసీమ ప్రజల కష్టాలు తనకు తెలుసునని చెప్పారు. రాయలసీమ ఎడారి అవుతుందని చెప్పిన దారుణ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ప్రజల్లో ఆశలు నింపారని గుర్తుకు తెచ్చుకున్నారు.
నదుల అనుసంధానం పూర్తి చేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీళ్లు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రైతులకు ₹10,000 కోట్ల విలువైన విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్నామని, రాయలసీమకు నీటిని తీసుకొచ్చిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు అన్నారు. ప్రతి ఎకరానికీ నీళ్లు అందే వరకు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతాయని హామీ ఇచ్చారు.