- వాటిలో తాము రూ.22 వేల కోట్లు మేం చెల్లించామన్న అశోక్ బాబు…
- Politics: వెంకట్రామిరెడ్డి జగన్ హయాంలోనే సస్పెండ్ అయ్యారని వెల్లడి..
Ashok Babu: ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు సచివాలయ ఉద్యోగ సంఘం మాజీ నేత కాకర్ల వెంకట్రామిరెడ్డిపై జరిగిన వేటుపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు స్పష్టతనిచ్చారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వెంకట్రామిరెడ్డిని తాము కావాలని ఇబ్బంది పెట్టలేదని, అసలు ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే అన్న విషయాన్ని గుర్తు చేశారు. 2024 ఏప్రిల్ 2వ తేదీన ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో, నిబంధనలకు విరుద్ధంగా వైకాపా జెండాలు పట్టుకుని కడప జిల్లాలోని నాలుగు ఆర్టీసీ డిపోల్లో ప్రచారం నిర్వహించినందుకు అప్పటి రిటర్నింగ్ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఆయనపై కేసులు నమోదయ్యాయని వివరించారు. జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఏప్రిల్ 18న పంచాయతీరాజ్ సెక్రటరీ వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేశారని, ఇప్పుడు ఆ విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ పార్టీలకు కొమ్ముకాయడం కాండక్ట్ రూల్స్ ప్రకారం నేరమని, అందుకే ఆనాడు నివేదికలు వచ్చాయని అశోక్ బాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గతంలో జరిగిన విచారణను లోతుగా పరిశీలించి, తప్పు నిరూపితం కావడంతోనే ఆయనను సర్వీసు నుంచి డిస్మిస్ చేశామని స్పష్టం చేశారు. కేవలం ఒక సెక్షన్ అధికారిని తొలగిస్తే రాష్ట్రంలో ఏదో జరిగిపోయినట్లు జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని, గతంలో ఏబీ వెంకటేశ్వరరావు వంటి ఉన్నతాధికారులను, మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్‌ను వేధించిన చరిత్ర జగన్ ప్రభుత్వానిదేనని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు రావాల్సిన రూ. 30 వేల కోట్ల బాకీలను పెట్టిన వ్యక్తి జగన్ అని, తాము అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే రూ. 22 వేల కోట్లు చెల్లించి ఉద్యోగుల పక్షపాతిగా నిలిచామని గుర్తు చేశారు.
వెంకట్రామిరెడ్డిపై కేవలం ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలే కాకుండా, హౌసింగ్ సొసైటీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయని అశోక్ బాబు తెలిపారు. గచ్చిబౌలిలోని సెక్రటేరియట్ హౌసింగ్ కాలనీలో ఖాళీ స్థలాలను అక్రమంగా ప్లాట్లుగా మార్చి విక్రయించారని, ఆ వ్యవహారం వల్ల మొత్తం సొసైటీయే రద్దయ్యే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. జగన్ రెడ్డికి దగ్గరి బంధువు కావడం వల్లే ఆయన సచివాలయంలో ఇష్టానుసారంగా వ్యవహరించారని, కరోనా సమయంలో వేల మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినా ఒక్కరికైనా సాయం చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. కాండక్ట్ రూల్స్ అనేవి అందరికీ సమానమేనని, తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదని ఈ సందర్భంగా అశోక్ బాబు హెచ్చరించారు.