బీహార్ లో విజయ పరంపర కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్సాహంగా ఉంది. అందుకే మహిళా ఓటర్లను ఆకర్షించేలా కొత్త పథకాలను ప్రవేశపెట్టి తమదైన శైలిలో దూసుకుపోతుంది మోదీ ప్రభుత్వం. ఓటర్లను ఎలా ఆకర్షించాలో, వారిని తమ వైపు ఎలా తిప్పుకోవాలో మోదీ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. ఆ వ్యూహంలో భాగంగానే మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోదీ రాబోయే కొన్ని రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా ఆయన ప్రత్యేకంగా మహిళలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా బీహార్‌లో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గమనార్హం. వచ్చే నెలలో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయనుంది. ఇదే సమయంలో ప్రధాని మోదీ ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మహిళల జీవితంలో మార్పు తీసుకురావడమే లక్ష్యం అని ఆయన చెప్పారు.
ఈ పథకాన్ని రూ.7,500 కోట్ల నిధులతో రూపొందించారు. దిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా మొదటి విడతలో 75 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జమ కానుంది. ఈ డబ్బు మహిళలు తమకు నచ్చిన జీవనోపాధి పనులు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అని మోడీ తెలిపారు.
ప్రధాని మాట్లాడుతూ గతంలో ఆర్జేడీ పాలనలో మహిళలు చాలా కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. అప్పుడు వారికి రక్షణ లేకపోయిందని, భద్రత పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని ఆరోపించారు. కానీ ఇప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం (కేంద్రం-రాష్ట్రం కలిపి) రావడంతో పరిస్థితులు చాలా మెరుగయ్యాయని చెప్పారు. మహిళల గౌరవం, భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఇంకా ఆయన బీహార్ ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. ఆర్జేడీ మళ్లీ అధికారంలోకి రాకుండా జాగ్రత్త పడాలని కోరారు. ఈ పథకం గురించి మొదట తెలుసుకున్నప్పుడు దాని లక్ష్యం చూసి తాను చాలా సంతోషించానని చెప్పారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒక మహిళ ఈ పథకం ద్వారా లాభం పొందుతుందని ప్రధాని హామీ ఇచ్చారు.
ఈ పథకం కేంద్ర ప్రభుత్వ “లఖ్‌పతి దీదీ అభియాన్”కు బలంగా తోడ్పడుతుందని ప్రధాని అన్నారు. ఈ రెండు పథకాల కలయికతో మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కలుగుతుందని, సమాజంలో వారి స్థాయి పెరుగుతుందని చెప్పారు. ప్రారంభ దశలో రూ.10 వేలు అందిస్తారు. తరువాతి దశల్లో మహిళలు రూ.2 లక్షల వరకు రుణం లేదా ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంటుందని వివరించారు. దీని వలన మహిళలు స్వయం ఉపాధి ఏర్పరచుకొని, కుటుంబానికి ఆదాయం తెచ్చే స్థాయికి చేరుకుంటారని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
మొత్తానికి ఈ పథకం మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం మాత్రమే కాకుండా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండబోతుంది. బీహార్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల సమయంలో ఈ పథకం మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా మోడీ తీసుకున్న ఈ నిర్ణయం బీహారులో తమ ప్రభుత్వం విజయం సాధిస్తుందేమో అని చెప్పడంలో అతిశయోక్తి లేదు..