జలధార జల హారతితో కంచాలమ్మ గండి చెరువు పునర్జీవనం కల్పించాలి..
మాండవ్య నది అభివృద్ధికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం
రాయచోటిలో జలవనరుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. “జలధార జల హారతి” కార్యక్రమం భాగంగా రాయచోటి మండలం ఎగువ అబ్బవరం వద్ద ఉన్న కంచాలమ్మ గండి చెరువును రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఇరిగేషన్, డ్వామా అధికారులతో కలిసి మంత్రి, కలెక్టర్ మాండవ్య నది నుంచి చెరువుకు వచ్చే నీటి ప్రవాహ మార్గాన్ని పరిశీలించారు. ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.
మంత్రి మాట్లాడుతూ మాండవ్య నదిని పూర్తిగా శుభ్రపరచి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన ప్రదేశాల్లో కొత్త చెక్‌డ్యామ్‌లు నిర్మించడం, దెబ్బతిన్న చెక్‌డ్యామ్‌లను మరమ్మతు చేయడం ద్వారా నీటి నిల్వ పెరగడంతో పాటు భూగర్భ జలాల స్థాయి కూడా పెరుగుతుందని తెలిపారు.
కంచాలమ్మ గండి చెరువుకు నీరు వచ్చే సప్లై ఛానల్‌ను సరిచేసి, ఎక్కడైనా అడ్డంకులు ఉంటే తొలగించి, నీటి ప్రవాహం నిరంతరంగా ఉండేలా చూడాలని మంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు. చెరువు పునరుద్ధరణతో పరిసర ప్రాంతాల్లో వ్యవసాయానికి మేలు జరిగి, తాగునీటి సమస్యలు కూడా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అదేవిధంగా మాండవ్య నదిని అందంగా తీర్చిదిద్దేలా బ్యూటిఫికేషన్ పనులు కూడా చేపట్టాలని మంత్రి సూచించారు. అలాగే గాలివీడు రింగ్ రోడ్ సమీపంలో ఉన్న ట్యాంకును కూడా పరిశీలించి, అక్కడి నీటి ప్రవాహ పరిస్థితులపై అధికారులతో చర్చించారు.
మంత్రిగారి సూచనల మేరకు చేపట్టాల్సిన పనులపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసి తక్షణమే ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జలధార కార్యక్రమాన్ని ఫలితాల ఆధారంగా విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, డ్వామా మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.