పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు పాస్ చేస్తే భారీ ఉద్యమం..
1960 నాటి DMKను మళ్లీ పరిచయం చేస్తా..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లును ఆమోదిస్తే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.
స్టాలిన్ మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశం పెట్టి ఈ బిల్లును తొందరగా ఆమోదించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు.
“ఇప్పటివరకు ఎవరూ చూడని విధంగా ఉద్యమం చూపిస్తా. 1960ల కాలంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కళగం పోరాట స్ఫూర్తిని మళ్లీ ప్రజలకు పరిచయం చేస్తా” అని స్టాలిన్ అన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరు మీద ప్రమాణం చేస్తూ, ఈ ఉద్యమం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ప్రజల హక్కుల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని స్టాలిన్ స్పష్టం చేశారు. “ఇదే నా చివరి హెచ్చరిక” అంటూ కేంద్రాన్ని స్టాలిన్ మరోసారి గట్టిగా నిలదీశారు. ఈ ప్రకటనతో డీలిమిటేషన్ బిల్లుపై దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ మరింత వేడెక్కే అవకాశముంది.