భారత మహిళల క్రికెట్ వరల్డ్ కప్ విజయంలో భాగమైన తెలుగు క్రికెటర్ శ్రీ చరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరుదైన గౌరవం ప్రకటించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమెకు రూ.2.5 కోట్ల నగదు బహుమతి, కడపలో 1000 చదరపు గజాల స్థలం, అలాగే గ్రూప్-1 ప్రభుత్వ ఉద్యోగం అందజేయనున్నట్టు ప్రకటించారు.
శుక్రవారం శ్రీ చరణి అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ను కలిసి వరల్డ్ కప్ విజయ అనుభవాలను పంచుకున్నారు. ఈ భేటీలో భారత మహిళల క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా పాల్గొన్నారు.
మహిళల వరల్డ్ కప్ గెలవడం దేశ గర్వకారణమని ముఖ్యమంత్రి అభినందించారు.
శ్రీ చరణి విజయం తెలుగు అమ్మాయిల ప్రతిభను ప్రపంచానికి చూపింది. క్రీడల్లో ముందుకు రావాలనుకునే యువతకు ఇది స్ఫూర్తి,” అని సీఎం చెప్పారు.
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న శ్రీ చరణికి మంత్రులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం ప్రకటించిన గుర్తింపుకు శ్రీ చరణి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం మహిళా క్రీడాకారులకు ప్రోత్సాహకంగా నిలుస్తుందని క్రీడా వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.