ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. వచ్చే వారం కేంద్ర కేబినెట్లో ఈ అంశంపై చర్చించి ఆమోదం పొందిన అనంతరం, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కార్ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నట్లుగా, రాష్ట్ర రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలనే నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని కేంద్రం భావిస్తోంది. ఆ నిబంధనల ప్రకారమే అమరావతిని రాజధానిగా ప్రకటించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది.
వాస్తవానికి 2014లో రాష్ట్ర విభజన అనంతరం అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి, భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు కూడా నిర్వహించింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టును పక్కనపెట్టి, మూడు రాజధానుల విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ కారణంగా అమరావతి రాజధాని అంశం ఐదేళ్లపాటు అనిశ్చితిలో పడింది. 2024లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, అమరావతిని మళ్లీ ఏకైక రాజధానిగా ప్రకటించి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని అధికారికంగా కోరింది.
విభజన చట్టం ప్రకారం గత పదేళ్లుగా హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగింది. అయితే 2024 జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక శాశ్వత రాజధానిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించాలని కోరుతూ కేంద్రానికి నోట్ పంపింది. అమరావతిని ఎంపిక చేసిన విధానం, అక్కడ చేపట్టిన రాజధాని నిర్మాణ పనులు, పరిపాలనకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను కూడా కేంద్ర హోం శాఖకు తెలియజేసింది. దీంతో అమరావతిని ఏ తేదీ నుంచి రాజధానిగా ప్రకటించాలనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
రాష్ట్ర ప్రభుత్వం 2024 జూన్ 2 నుంచే అమరావతిని రాజధానిగా ప్రకటించాలని సూచించడంతో, విభజన చట్టానికి నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోం శాఖ అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల అభిప్రాయాలను కోరింది. ఇప్పటికే పలు శాఖలు తమ అభిప్రాయాలు వెల్లడించగా, పట్టణాభివృద్ధి, న్యాయ, వ్యయ శాఖలతో పాటు నీతి ఆయోగ్ అభిప్రాయాలను త్వరగా పంపాలని హోం శాఖ కోరినట్లు తెలుస్తోంది. అన్ని అభిప్రాయాలు వచ్చిన అనంతరం కేంద్ర కేబినెట్ నోట్‌ను సిద్ధం చేసి మంత్రిమండలి ఆమోదం పొందనుంది. ఆ తర్వాత పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఉభయసభల్లో ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉండటంతో బిల్లు ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనితో అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పూర్తి చట్టబద్ధత లభించనుంది.