ప్రస్తుతం సమాజంలో థైరాయిడ్ సమస్య వేగంగా పెరుగుతోంది. చిన్నవారు, పెద్దవారు అనే తేడా లేకుండా ఈ వ్యాధి చాలా మందిని వేధిస్తోంది. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, బిజీ లైఫ్, ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పులు ఇవన్నీ థైరాయిడ్ సమస్యకు కారణమవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోందని, దీని వల్ల పీరియడ్స్ అసమాన్యత, బరువు పెరగడం, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయని వారు సూచిస్తున్నారు.
థైరాయిడ్ ఉన్నవారు తినే ఆహారంలో జాగ్రత్తలు చాలా అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్రోకలి, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు తినకూడదని చెబుతున్నారు. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును అడ్డుకుంటాయని నిపుణులు అంటున్నారు. అలాగే సోయా ఉత్పత్తులు కూడా హార్మోన్ ఉత్పత్తిని తగ్గించే ప్రమాదం ఉందని తెలిపారు. సోయాలో ఉండే ఐసోఫ్లేవన్స్ అనే పదార్థం థైరాయిడ్ హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్యులు వివరిస్తున్నారు.
అలాగే అధికంగా చక్కెర ఉన్న ఆహారం, ప్యాక్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తీసుకోవడం కూడా థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తుంది. వీటివల్ల హార్మోన్ స్థాయిల్లో మార్పులు వచ్చి సమస్య మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా మద్యం సేవించడం, అధికంగా టీ, కాఫీలు తాగడం కూడా థైరాయిడ్ మందుల ప్రభావాన్ని తగ్గిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫ్యాట్ అధికంగా ఉన్న ఆహారం కూడా ట్యాబ్లెట్ల ప్రభావాన్ని తగ్గిస్తుందని వారు సూచించారు.
థైరాయిడ్ ఉన్నవారు తినాల్సిన ఆహారాలపై కూడా వైద్యులు స్పష్టత ఇచ్చారు. గుడ్లు, బాదం, వేరుసెనగలు, సన్ఫ్లవర్ గింజలు, తాజా పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్, గోధుమ రొట్టెలు వంటి ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పారు. ఇవి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు అందిస్తాయి. అలాగే ప్రతిరోజూ సరిపడా నీరు తాగడం, వ్యాయామం చేయడం ద్వారా థైరాయిడ్ సమస్యను నియంత్రణలో ఉంచవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
మొత్తం మీద, థైరాయిడ్ ఒక సాధారణమైన కానీ నిర్లక్ష్యం చేస్తే తీవ్రమయ్యే వ్యాధి. సరైన ఆహారం, వ్యాయామం, మందుల వినియోగం, జీవనశైలిలో మార్పులతో దీన్ని సులభంగా నియంత్రించవచ్చు. ఆరోగ్య నిపుణులు చెబుతున్న సూచనలను పాటించడం ద్వారా థైరాయిడ్ సమస్యను తగ్గించి, ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించవచ్చని వైద్యులు తెలిపారు.