స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి, ముఖ్యంగా ఐపీఓలలో (IPO - Initial Public Offering) డబ్బులు పెట్టినవారికి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ నిజంగానే గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఐపీఓకు వచ్చిన ఈ దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో అదరగొట్టింది. ఏకంగా 50 శాతం ప్రీమియంతో కంపెనీ షేర్లు లిస్ట్ అవ్వడం అనేది రికార్డ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు.
దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ (LG) అనుబంధ సంస్థ అయిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ఐపీఓపై ఇన్వెస్టర్లలో ఎంత నమ్మకం ఉందో ఈ లిస్టింగ్ నిరూపించింది. ఒక్కో షేరుపై రూ. 570 లాభం..
లిస్టింగ్ రోజున ఎల్జీ ఎలక్ట్రానిక్స్ షేర్ల ప్రదర్శన ఇన్వెస్టర్ల ముఖాల్లో సంతోషాన్ని నింపింది. ఐపీఓలో ఒక్కో షేరు ధరను కంపెనీ రూ. 1,080 - రూ. 1,140 గా నిర్ణయించింది. బీఎస్‌ఈ (BSE) లో ఈ షేరు ఏకంగా రూ. 1,715 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.
ఎన్‌ఎస్‌ఈ (NSE) లో కూడా రూ. 1,710 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. సాధారణంగా ఏ ఐపీఓ అయినా 5 నుంచి 10 శాతం ప్రీమియంతో లిస్ట్ అయితే గొప్ప అనుకుంటారు. కానీ, ఎల్జీ ఏకంగా 50 శాతానికి పైగా ప్రీమియంతో లిస్ట్ అవ్వడం అంటే, ఆ కంపెనీపై మార్కెట్‌కు ఉన్న నమ్మకం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
పెట్టుబడిదారులకు లాభం ఎంత?
ఐపీఓలో షేర్లు దక్కించుకున్న ఇన్వెస్టర్లు (Investors), ఒక్కో షేరుపై కనీసం రూ. 570 వరకు లాభపడ్డారు. ఉదాహరణకు, మీరు రూ. 1,140 వద్ద ఒక షేరు కొని, దాన్ని లిస్టింగ్ రోజున రూ. 1,710 వద్ద అమ్మితే, మీకు రూ. 570 లాభం వచ్చినట్లే. ఐపీఓలో ఎక్కువ షేర్లు పొందిన వారికి ఇది నిజంగా బంపర్ లాభం అని చెప్పవచ్చు.
అనూహ్య స్పందన.. భారీ ఓవర్ సబ్‌స్క్రిప్షన్….
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ స్పందనే షేర్ లిస్టింగ్‌లో ఇంత పెద్ద ప్రీమియం రావడానికి ప్రధాన కారణం. మొత్తంగా 7,13,34,320 షేర్లకు గానూ, ఏకంగా 7,44,73,685 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఈ ఐపీఓ తొలిరోజే పూర్తిగా సబ్ స్క్రైబ్ కావడం విశేషం. మొత్తంగా ఈ ఐపీఓ 1.04 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది.
రూ. 11,607 కోట్ల ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 9న ముగిసింది. 10.2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచడం ద్వారా రూ. 15 వేల కోట్లను సమీకరించే లక్ష్యంతో ఎల్‌జీ ఈ ఐపీఓను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ లక్ష్యం దాదాపుగా నెరవేరినట్లే.
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లిస్టింగ్ విజయవంతం కావడం, ఐపీఓ మార్కెట్‌పై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని మరోసారి నిరూపించింది. కొత్త ఐపీఓలలో పెట్టుబడులు పెట్టేవారికి ఇది మరింత ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.