ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీశైల మల్లన్న ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఇది ఆయనకు ఒక ముఖ్యమైన పర్యటనగా భావిస్తున్నారు. ఇప్పటివరకు భారతదేశ ప్రధానమంత్రులలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు మాత్రమే శ్రీశైలానికి వచ్చారు. ఇప్పుడు మోదీ నాలుగో ప్రధానిగా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకోబోతున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో, భద్రతా బలగాలతో నిండిపోయింది. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మోదీ దర్శనానికి ముందు ఆలయ పరిసరాల్లో శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేశారు.
ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 9.55 గంటలకు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్కడ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, సత్య కుమార్ యాదవ్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆర్మీ హెలికాప్టర్లో శ్రీశైలం బయలుదేరారు.
మోదీ పర్యటన నేపథ్యంలో కర్నూలు నగరం మొత్తం పూలతో, బ్యానర్లతో అలంకరించబడింది. రోడ్ల వెంట ప్రజలు ‘మోదీ మోదీ’ అంటూ స్వాగతం పలుకుతున్నారు. శ్రీశైలంలో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ పర్యటన కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు. భద్రతా దళాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి.
ప్రధాని మోదీ శ్రీశైల మల్లన్న స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ఏర్పాటుచేసిన ప్రదర్శనను పరిశీలిస్తారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ స్మారక చిహ్నాలను అందజేయనున్నారు.
శ్రీశైలం దర్శనం అనంతరం మోదీ మధ్యాహ్నం 2.20 గంటలకు కర్నూలు తిరిగి చేరుకుని, అక్కడ ఏర్పాటు చేసిన జీఎస్టీ సభలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై, కేంద్ర ప్రాజెక్టులపై ఆయన ప్రసంగించనున్నట్లు సమాచారం. ఇక పర్యటన సజావుగా సాగేందుకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ప్రజలు పెద్దఎత్తున మోదీని చూసేందుకు రోడ్ల వెంట తరలి వస్తుండటంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో మోదీ పర్యటనను ప్రజలు ఉత్సాహంగా స్వాగతిస్తున్నారు.