తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్65)ను ఆరు వరుసలుగా విస్తరించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) సిద్ధం చేసిన డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) పూర్తయింది. ఈ నివేదికను ప్రస్తుతం పీఏటీఎస్‌సీ కమిటీ పరిశీలనకు సమర్పించారు. కమిటీ ఆమోదం లభిస్తే ప్రాజెక్టు అమలు దిశగా వేగం పెరగనుంది. ఈ విస్తరణతో విజయవాడ–హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, వాణిజ్య, పారిశ్రామిక రవాణా మరింత సులభతరం కానుంది.
ఈ నేషనల్ హైవే విస్తరణలో మొత్తం 231.32 కిలోమీటర్ల మేర రహదారి ఆరు వరుసలుగా మారనుంది. ఇందులో ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 50 కిలోమీటర్ల రోడ్డును విస్తరించడంతో పాటు, కొత్తగా రెండు బైపాస్ రోడ్లు మరియు ఒక వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. నందిగామ సమీపంలోని అంబారుపేట–ఐతవరం మధ్య 7.3 కిలోమీటర్ల బైపాస్, అలాగే కాచవరం నుంచి మూలపాడు మీదుగా ఇబ్రహీంపట్నం వరకు 16.15 కిలోమీటర్ల మరో బైపాస్‌ను ప్రణాళికలో చేర్చారు. ఇందులో 15.6 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ రోడ్‌గా రూపొందనుంది. అదనంగా మునేరుపై కొత్త వంతెన నిర్మాణం కూడా ప్రణాళికలో ఉంది. ఈ రహదారి విస్తరణ వల్ల ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అధికారులు విశ్వసిస్తున్నారు.
డీపీఆర్‌లో నాలుగు విభిన్న ప్రణాళికలను రూపొందించిన ఎన్‌హెచ్‌ఏఐ, వాటిలో మొదటి ప్లాన్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ ప్లాన్ ప్రకారం రెండు వెహికల్ అండర్‌పాస్‌లు, రెండు లైట్ వెహికల్ అండర్‌పాస్‌లు, నాలుగు ఎస్‌వీయూపీలు (సర్వీస్ వీకిల్ అండర్ పాస్‌లు) నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది. పీఏటీఎస్‌సీ కమిటీ నుంచి ఎటువంటి మార్పులు లేకుండా ఆమోదం లభిస్తే, ప్రాజెక్టు ఫైల్స్‌ను పీపీపీ ఏప్రైజల్ కమిటీకి పంపిస్తారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
టెండర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు సుమారు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని దశలు సజావుగా జరిగితే 2026 ఏప్రిల్ నాటికి రహదారి విస్తరణ పనులు ప్రారంభమవుతాయని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే, హైదరాబాద్–విజయవాడ మధ్య ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యవంతంగా మారనుంది. రాబోయే రోజుల్లో ఈ మార్గం రాష్ట్రాల మధ్య వాణిజ్యానికి, పర్యాటకానికి, పరిశ్రమల అభివృద్ధికి పునాదిగా నిలవనుంది.