AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై అప్పట్లోనే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయని, ఆ మరణం వెనుక జగన్ హస్తం ఉందంటూ నాడు బొత్స సత్యనారాయణే స్వయంగా అన్నారని గుర్తు చేశారు. పదవి కోసం జగన్ ఎంతటి దారుణానికైనా ఒడిగడతారని, సొంత తండ్రి మరణాన్ని కూడా సానుభూతిగా మార్చుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
తండ్రి మరణించినప్పుడు జగన్ ఎక్కడ ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. వైఎస్ ఆచూకీ తెలియక రాష్ట్రమంతా ఆందోళనలో ఉన్న సమయంలో, కనీసం మరణం నిర్ధారణ కాకముందే జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించడం చూస్తుంటే ఆయనకు పదవిపై ఉన్న వ్యామోహం అర్థమవుతోందని విమర్శించారు. అధికారం కోసం ఆరాటపడటమే తప్ప, తండ్రిని కోల్పోయిన బాధ ఆయనలో ఎక్కడా కనిపించలేదని అచ్చెన్న ఎద్దేవా చేశారు.
జగన్ రాజకీయ ప్రస్థానం అంతా అబద్ధాలు, విధ్వంసంతోనే సాగిందని మంత్రి ఆరోపించారు. 'ఒక్క అవకాశం' అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారని, సొంత కుటుంబ సభ్యులను కూడా కేవలం పదవి కోసం వాడుకుని వదిలేయడం జగన్ నైజమని విమర్శించారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఎవరినీ లెక్కచేయని మనస్తత్వం ఆయనదని అన్నారు.
ముఖ్యంగా జగన్ తన సొంత చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ పట్ల ప్రవర్తించిన తీరుపై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల ఎంతో కష్టపడి పాదయాత్ర చేసి పార్టీని బతికించిందని, తీరా అధికారం వచ్చాక ఆమెకు ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ఇంటి నుంచి బయటకు పంపేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. తల్లికి కూడా న్యాయం చేయని వ్యక్తి, రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు.
వైఎస్సార్సీపీ నాయకులు తిరుమల పేరు ఎత్తే అర్హత కూడా కోల్పోయారని అచ్చెన్నాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులకు భక్తులకు క్షమాపణలు చెప్పి, లెంపలేసుకుంటేనే వారు పవిత్ర పుణ్యక్షేత్రాల గురించి మాట్లాడాలని సూచించారు. మళ్లీ కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్న జగన్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఆయనకు తగిన బుద్ధి చెబుతారని మంత్రి హెచ్చరించారు.