ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2027 నాటికి భూములకు సంబంధించిన అన్ని వివాదాలను పూర్తిగా తొలగిస్తామని ఆయన ప్రకటించారు. గురువారం నారావారిపల్లెలో మీడియాతో మాట్లాడిన సీఎం, రెవెన్యూ వ్యవస్థలో విస్తృతమైన సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు భూములపై పూర్తి స్పష్టత, నమ్మకం కలిగే విధంగా పాలన కొనసాగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. భూమి వివాదాలు పరిష్కారమైతే గ్రామీణాభివృద్ధికి వేగం వస్తుందని అభిప్రాయపడ్డారు.
భూముల రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని సీఎం తెలిపారు. అందులో భాగంగా ప్రతి నెలా తొమ్మిదో తేదీన పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేసే విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. సర్వే పూర్తయిన భూములకు ఎలాంటి ఖర్చు లేకుండా క్యూఆర్ కోడ్ కలిగిన పట్టాదారు పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అనేక భూములను ఇష్టానుసారంగా వివాదాల జాబితాలో చేర్చారని విమర్శించారు. 22ఏ విభాగం పేరుతో ప్రజలను అయోమయంలోకి నెట్టారని పేర్కొన్నారు. ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు ఒకే ఏడాదిలో భూ సర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.
ఈ ఏడాది మొత్తం జాయింట్ కలెక్టర్లు రెవెన్యూ సమస్యల పరిష్కారంపైనే దృష్టి సారించి పనిచేస్తారని సీఎం తెలిపారు. భూమి వివాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అవి తొలగితే గ్రామాల్లో అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని చెప్పారు. అదే సమయంలో పర్యాటక రంగ అభివృద్ధిపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. తిరుపతి పరిసర గ్రామాల్లో హోం స్టేలను ప్రోత్సహించడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. తిరుపతి, విశాఖ, అమరావతిని మెగా నగరాలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
సామాజిక అభివృద్ధి విషయంలో జన్మభూమిని ఎవరూ మర్చిపోకూడదని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ విధానాల ద్వారా చదువుకుని ఉన్నత స్థాయికి చేరిన వారు ఉన్నప్పటికీ, ఇంకా చాలా కుటుంబాలు పేదరికంలోనే ఉన్నాయని అన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు పీ4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. మార్గదర్శి–బంగారు కుటుంబాల విధానం ద్వారా పేదరికాన్ని క్రమంగా తగ్గించడమే లక్ష్యమన్నారు. పది లక్షల కుటుంబాలను దత్తత తీసుకుని వారికి ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా నైపుణ్యాభివృద్ధి, మార్గనిర్దేశం అందించనున్నట్లు చెప్పారు.
గ్రామాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా ‘స్వర్ణ నారావారిపల్లె’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. రంగంపేట, కందులవారిపల్లె, చిన్నరామపురం గ్రామాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. మౌలిక సదుపాయాలు, ఇళ్లు, రహదారులు, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. చెత్తను శాతం వందకు వంద సేకరించి వర్గీకరించి కంపోస్ట్ తయారు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని సీఎం అభిప్రాయపడ్డారు.