సంక్రాంతి పండుగలో చివరి రోజుగా జరుపుకునే కనుమ, గ్రామీణ జీవన విధానానికి అద్దం పడే ముఖ్యమైన పండుగగా గుర్తింపు పొందింది. వ్యవసాయం, పశుపోషణతో ముడిపడి ఉన్న ఈ వేడుక రైతుల కష్టానికి, ప్రకృతికి మనిషి ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. పంటలు చేతికొచ్చిన ఆనందాన్ని కుటుంబసభ్యులు, గ్రామస్తులతో కలిసి పంచుకునే రోజు కనుమగా భావిస్తారు.
తెలుగు రాష్ట్రాలలో కనుమను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున పశుపూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. రైతులు తమ ఎద్దులు, ఆవులను స్నానమాచారాలు చేయించి, పూలు, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. పశువులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, వాటి సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. గ్రామాల్లో ఎడ్ల బండ్ల పందాలు, పశు ప్రదర్శనలు, జానపద కళలు కనుమ రోజున ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
కనుమ పండుగకు వంటకాలకూ ప్రత్యేక స్థానం ఉంది. మాంసాహార వంటకాలు, కొత్త బియ్యం, చెరకు, నువ్వులు, బెల్లంతో తయారైన పిండివంటలు ఈ రోజు ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు. బంధుమిత్రులు ఒకచోట చేరి కలిసి భోజనాలు చేయడం, ఆనందంగా కాలం గడపడం కనుమ సంప్రదాయంలో భాగం. గ్రామీణ ప్రాంతాల్లో ఆటలు, పాటలు, నృత్యాలతో పండుగ వాతావరణం నెలకొంటుంది.
కనుమ రోజు ప్రయాణాలు ఎందుకు చేయకూడదు?
అప్పట్లో రవాణా సదుపాయం అంటే ఎడ్ల బండ్లే. ఎక్కడికైనా వెళ్లాలన్నా వాటిపైనే ప్రయాణం చేసేవారు. కనుమ పండుగ పసుసేవకు అంకితం కాబట్టి, ఆ రోజు పశువులకు ఎలాంటి శ్రమ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ప్రయాణాలు చేసేవారు కాదు. అదే ఆనవాయతీగా వచ్చిందని అందరూ నమ్ముతారు.
కనుమ పండుగను తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా విభిన్న రూపాల్లో జరుపుకుంటారు. తమిళనాడులో పొంగల్ ఉత్సవాల్లో భాగంగా ‘మట్టు పొంగల్’ పేరుతో పశుపూజ నిర్వహిస్తారు. కర్ణాటకలో సంక్రాంతి వేడుకల్లో పశువుల అలంకరణ, పూజలు జరుగుతాయి. పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో లోహ్రీ, మాఘీ సందర్భాల్లో వ్యవసాయంతో ముడిపడ్డ ఆచారాలు కనిపిస్తాయి. పేర్లు మారినా, పశువులకు గౌరవం చెల్లించడం, ప్రకృతికి కృతజ్ఞత చెప్పడం అనే భావన దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటుంది.
కనుమ పండుగ మనకు కష్టపడి పనిచేసే పశువుల విలువను గుర్తు చేస్తుంది. ప్రకృతి, వ్యవసాయం, గ్రామీణ జీవితం పట్ల గౌరవాన్ని పెంపొందిస్తూ, ఐక్యత, ఆనందం, సంప్రదాయాలను తరతరాలకు అందించే పండుగగా కనుమ నిలుస్తోంది.
మీకూ మీ కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రవాసి తరపున కనుమ పండుగ శుభాకాంక్షలు.