విదేశాల్లో భారత మామిడి రుచుల హవా.. ఎయిర్ ఇండియా రికార్డు రవాణా..
ఆల్ఫోన్సో, కేసర్ మామిడికి ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్..
న్యూఢిల్లీ: భారతీయ మామిడిపండ్లకు విదేశాల్లో ఉన్న ఆదరణ మరోసారి స్పష్టమైంది. మార్చి నుంచి మే 2026 వరకు కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ నెట్‌వర్క్ ద్వారా 1,000 టన్నులకు పైగా మామిడిపండ్లను ప్రపంచంలోని పలు దేశాలకు రవాణా చేసింది. ఇదే కాలంలో సంస్థ మొత్తం 3,300 టన్నులకు పైగా తాజా పండ్లు, కూరగాయలను తరలించగా, అందులో దాదాపు మూడో వంతు మామిడిపండ్లే కావడం విశేషం.
ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో పండే ఆల్ఫోన్సో, కేసర్ రకాల మామిడిపండ్లకు విదేశీ మార్కెట్లలో భారీ డిమాండ్ నెలకొంది. యూరప్, ఉత్తర అమెరికా, పశ్చిమ ఆసియా తదితర ప్రాంతాలకు ఈ మామిడిపండ్లను పెద్ద ఎత్తున ఎగుమతి చేశారు.
ఎయిర్ ఇండియా గణాంకాల ప్రకారం మార్చి నెలలో 805 టన్నుల పండ్లు, కూరగాయలను రవాణా చేయగా, మామిడి సీజన్ గరిష్ఠ స్థాయికి చేరుకున్న ఏప్రిల్‌లో ఈ పరిమాణం 1,275 టన్నులకు పెరిగింది. మే నెలలో కూడా 1,233 టన్నుల సరుకును వివిధ దేశాలకు తరలించింది.
భారత మామిడిపండ్ల ఎగుమతులకు ముంబయి ప్రధాన కేంద్రంగా నిలిచింది. మహారాష్ట్ర, గుజరాత్‌లోని మామిడి తోటలకు సమీపంలో ఉండటంతో ఎక్కువ భాగం సరుకు అక్కడి నుంచే విదేశాలకు పంపించారు. సీజన్ గరిష్ఠ సమయంలో ప్రతి వారం ముంబయి నుంచి లండన్ హీత్రో విమానాశ్రయానికి సుమారు 180 టన్నుల మామిడిపండ్లు తరలించారు. అలాగే ఫ్రాంక్‌ఫర్ట్‌కు వారానికి 40 టన్నులు, దుబాయ్, న్యూఆర్క్, న్యూయార్క్ జేఎఫ్‌కే విమానాశ్రయాలకు తలా 30 టన్నుల వరకు సరుకు పంపినట్లు సంస్థ తెలిపింది.
మామిడిపండ్లతో పాటు ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో, టొరంటో, పారిస్, హాంకాంగ్, సిడ్నీ వంటి నగరాలకు కూడా పలు రకాల త్వరగా పాడయ్యే ఆహార ఉత్పత్తులను ఎయిర్ ఇండియా రవాణా చేసింది.
ఏటా నాలుగు లక్షల టన్నులకు పైగా కార్గోను నిర్వహిస్తున్న ఎయిర్ ఇండియా, తాజా పండ్లు మరియు కూరగాయల నాణ్యతను కాపాడేందుకు ప్రత్యేక శీతల సరఫరా వ్యవస్థను ఉపయోగిస్తోంది. రైతుల నుంచి సేకరించిన ఉత్పత్తులను రిఫ్రిజిరేటెడ్ ట్రక్కుల ద్వారా విమానాశ్రయాలకు తరలించి, అక్కడ ఉష్ణోగ్రత నియంత్రిత గిడ్డంగుల్లో భద్రపరుస్తున్నారు. అనంతరం ప్రత్యేక జాగ్రత్తలతో విమానాల్లో లోడ్ చేస్తున్నారు.
ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, లండన్ హీత్రో, ఫ్రాంక్‌ఫర్ట్, జేఎఫ్‌కే, న్యూఆర్క్ సహా 14 విమానాశ్రయాల్లో కోల్డ్ స్టోరేజ్, యాక్టివ్ కంటైనర్ సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఉష్ణోగ్రత స్థిరంగా ఉండేందుకు కూల్ డాలీలు, థర్మల్ బ్లాంకెట్లు వంటి ప్రత్యేక పరికరాలను వినియోగిస్తున్నట్లు తెలిపింది.
మూడు నెలల్లోనే వెయ్యి టన్నులకు పైగా మామిడిపండ్లను రవాణా చేయడం భారత మామిడిపండ్లకు ఉన్న అంతర్జాతీయ డిమాండ్‌ను ప్రతిబింబిస్తోందని ఎయిర్ ఇండియా కార్గో విభాగాధిపతి రమేశ్ మామిడాల అన్నారు. త్వరగా పాడయ్యే ఉత్పత్తుల రవాణాలో ప్రతి దశలో నాణ్యతను కాపాడేందుకు తమ బృందం భాగస్వామ్య సంస్థలతో కలిసి సమన్వయంగా పనిచేస్తోందని చెప్పారు.
విదేశాల్లో ముఖ్యంగా భారతీయ ప్రవాసులు అధికంగా నివసించే ప్రాంతాల్లో భారత మామిడిపండ్లకు వేసవి కాలంలో ప్రత్యేక ఆదరణ కొనసాగుతోందని, అందుకే ప్రతి ఏడాది డిమాండ్ పెరుగుతోందని ఎయిర్ ఇండియా పేర్కొంది.