Samsung Galaxy S27 Pro: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది మార్కెట్లోకి రాబోయే 'గెలాక్సీ S27' సిరీస్‌లో కొత్తగా ఒక 'ప్రో' మోడల్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటివరకు కేవలం స్టాండర్డ్, ప్లస్, అల్ట్రా వేరియంట్లను మాత్రమే అందిస్తున్న శాంసంగ్, ఇప్పుడు యాపిల్ ఐఫోన్ల తరహాలో తన ప్రీమియం లైనప్‌ను మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. ఈ కొత్త ప్రో మోడల్ అల్ట్రా వేరియంట్‌కు దాదాపు సమానంగా ఉన్నప్పటికీ, వినియోగదారులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందించనుంది.
కొరియన్ వార్తా సంస్థల కథనం ప్రకారం... ఈ గెలాక్సీ S27 ప్రో వెర్షన్ అల్ట్రా మోడల్‌లో ఉండే అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంటుంది. అయితే, ఇందులో 'S-పెన్' సదుపాయం మాత్రం ఉండదు. పెన్ అవసరం లేని, కానీ అత్యుత్తమ కెమెరా డిస్‌ప్లే క్వాలిటీ కోరుకునే యూజర్ల కోసం శాంసంగ్ ఈ కొత్త ఫోన్‌ను డిజైన్ చేస్తోంది. దీనివల్ల ఫోన్ ధర అల్ట్రా కంటే కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది, తద్వారా ఎక్కువ మంది ప్రీమియం కస్టమర్లను ఆకట్టుకోవచ్చని కంపెనీ భావిస్తోంది.
డిస్‌ప్లే విషయంలో కూడా శాంసంగ్ ఒక అడుగు ముందుకు వేస్తోంది. గెలాక్సీ S26 అల్ట్రాలో పరిచయం చేయబోయే 'ప్రైవసీ డిస్‌ప్లే' ఫీచర్‌ను S27 ప్రోలో కూడా తీసుకురానున్నారు. దీనివల్ల పక్కన ఉన్న వారికి ఫోన్ స్క్రీన్ కనిపించకుండా భద్రత పెరుగుతుంది. అంతేకాకుండా, ఈ ప్రో మోడల్‌లో భారీ 200 మెగాపిక్సెల్ కెమెరాను కూడా చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడే వారికి, ఎస్-పెన్ అవసరం లేని వారికి ఇది ఒక మంచి ఆప్షన్‌గా మారనుంది.
గతంలో శాంసంగ్ 'S25 ఎడ్జ్' పేరుతో ఒక సన్నని మోడల్‌ను తేవాలని ప్రయత్నించి విరమించుకుంది. కానీ ఈసారి రాబోయే ప్రో మోడల్ కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదని, శాంసంగ్ లైనప్‌లో శాశ్వత స్థానం సంపాదించుకుంటుందని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో యాపిల్ ఐఫోన్ ప్రో ప్రో మాక్స్ మోడల్స్ సృష్టిస్తున్న ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని, శాంసంగ్ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంది. సింగిల్ ప్రీమియం మోడల్ నుండి మల్టీ-టైర్ ప్రీమియం లైనప్‌కు కంపెనీ మళ్లుతోంది.
వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సిరీస్ గురించి ఇప్పటికే టెక్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫోల్డబుల్ ఫోన్ల విభాగంలో దూసుకుపోతున్న శాంసంగ్, ఇప్పుడు సాధారణ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కూడా తన పట్టును నిరూపించుకోవాలని చూస్తోంది. ఈ కొత్త ప్రో మోడల్ రాకతో గెలాక్సీ S27 సిరీస్ మరింత శక్తివంతంగా మారుతుందని, కస్టమర్లకు ఎంపిక చేసుకునే అవకాశం పెరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.