Middle East War: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల మన దేశంలో వస్తువుల ధరలు ఎక్కడ పెరిగిపోతాయో అని సామాన్యులు కంగారు పడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం మంచి వార్త చెప్పింది. ప్రస్తుతం మన దగ్గర ఆహార ధాన్యపు నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ధరలు పెరిగే అవకాశం లేదని స్పష్టం చేసింది. యుద్ధం జరుగుతున్నా సరే, నిత్యావసర వస్తువుల రేట్లను ప్రభుత్వం నిరంతరం కనిపెట్టుకుని ఉంటోందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.
దేశవ్యాప్తంగా వందలాది కేంద్రాల ద్వారా ప్రతిరోజూ సుమారు 40 రకాల ముఖ్యమైన వస్తువుల ధరలను అధికారులు పరిశీలిస్తున్నారు. పప్పులు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు వంటి వాటి ఉత్పత్తి ఈ ఏడాది బాగుందని, ప్రభుత్వం దగ్గర సరిపడా బఫర్ స్టాక్ కూడా ఉందని తెలిపారు. ఒకవేళ ఎవరైనా వస్తువులను అక్రమంగా దాచిపెట్టి, ధరలు పెంచాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు.
ఆహార ధాన్యాల విషయానికి వస్తే, మన దేశ అవసరాల కంటే మూడు రెట్లు ఎక్కువ నిల్వలు ఇప్పుడు గోదాముల్లో సిద్ధంగా ఉన్నాయి. సుమారు 602 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, బియ్యం మన దగ్గర ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. దీనివల్ల రేషన్ షాపులకు గానీ, బయట మార్కెట్కు గానీ ఎటువంటి కొరత రాదు. ఇతర దేశాల నుంచి కూడా దిగుమతులు ఆగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.
సముద్ర మార్గంలో సరుకులు నౌకల విషయంలో కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల గుండా వచ్చే భారతీయ నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తున్నాయని షిప్పింగ్ శాఖ తెలిపింది. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల తయారీకి వాడే ఎల్పీజీని తీసుకొచ్చే నౌకలు ఎప్పటికప్పుడు భారత్కు చేరుకుంటున్నాయి. అక్కడ పని చేస్తున్న మన భారతీయ నావికులు కూడా క్షేమంగా ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది.
అయితే చమురు, గ్యాస్ దిగుమతుల విషయంలో కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఉన్న మాట నిజమేనని ప్రభుత్వం అంగీకరించింది. ఎందుకంటే మనకు వచ్చే గ్యాస్లో ఎక్కువ భాగం యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచే రావాలి. అయినప్పటికీ మన దేశ చమురు కంపెనీలు పరిస్థితిని చక్కదిద్దుతున్నాయని, ఇంధన కొరత రాకుండా పకడ్బందీ ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు