రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం ఎంత పెరిగిందో, అదే స్థాయిలో ఫాస్ట్ చార్జింగ్ అవసరం కూడా పెరిగింది. ఉదయం ఇంటి నుంచి బయలుదేరే ముందు లేదా ఆఫీస్‌కు వెళ్లే హడావుడిలో ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉంటే చాలామంది వెంటనే ఫాస్ట్ చార్జర్ కోసం వెతుకుతుంటారు. ప్రస్తుతం మార్కెట్లో 30 వాట్స్, 60 వాట్స్, 90 వాట్స్ వరకు సపోర్ట్ చేసే చార్జర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వాటేజీల మధ్య అసలు తేడా ఏమిటి, బ్యాటరీ మన్నికకు ఏది మంచిదనే సందేహం చాలా మందిలో ఉంది.
చార్జర్ ఎంత వేగంగా ఫోన్‌ను చార్జ్ చేస్తుందన్నది ప్రధానంగా దాని వాటేజ్‌పై ఆధారపడి ఉంటుంది. వాటేజ్ ఎక్కువగా ఉంటే, ఫోన్‌కు ఎక్కువ పవర్ సరఫరా అవుతుంది. దీంతో తక్కువ సమయంలోనే బ్యాటరీ శాతం పెరుగుతుంది. ఉదాహరణకు 60 వాట్స్ చార్జర్, 30 వాట్స్ చార్జర్‌తో పోలిస్తే దాదాపు రెట్టింపు శక్తిని అందిస్తుంది. అందుకే కొంతమంది ఎక్కువ వాటేజ్ ఉన్న చార్జర్ ఉంటే చాలు అని భావిస్తారు. కానీ ఇక్కడే చాలా మంది చేసే పెద్ద పొరపాటు దాగి ఉంది.
ఫోన్ తయారీదారులు ప్రతి మోడల్‌కు అనుగుణంగా ఎంత వాటేజ్ సపోర్ట్ చేస్తుందో స్పష్టంగా చెబుతారు. ఒక ఫోన్ 30 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కే డిజైన్ చేసి ఉంటే, దానిపై 60 లేదా 90 వాట్స్ చార్జర్ వాడటం మంచిది కాదు. అలా వాడితే ఫోన్ వెంటనే పాడవకపోయినా, దీర్ఘకాలంలో బ్యాటరీ పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా మధ్యస్థాయి స్మార్ట్‌ఫోన్లకు 30 వాట్స్ చార్జర్ సరిపోతుంది. ఇవి ఫోన్‌ను ఓ మోస్తరు వేగంతో చార్జ్ చేస్తాయి, అలాగే చార్జింగ్ సమయంలో అధికంగా వేడెక్కకుండా కాపాడతాయి.
ఇక ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల విషయానికి వస్తే, ఇవి ప్రత్యేకంగా అధిక వాటేజ్ ఫాస్ట్ చార్జింగ్‌ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తారు. ఇలాంటి ఫోన్లలో బ్యాటరీ నిర్మాణం, హీట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మరింత ఆధునికంగా ఉంటుంది. అందుకే 60 లేదా 90 వాట్స్ చార్జర్ ఉపయోగించినా వేడి నియంత్రణలోనే ఉంటుంది. కొన్ని ఫోన్లు కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే 50 శాతం వరకు చార్జ్ అవుతున్నాయంటే, దానికి కారణం ఈ ప్రత్యేక టెక్నాలజీనే.
అయితే అధిక వాటేజ్ చార్జర్ వాడితే బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందన్న భయం కూడా వినియోగదారుల్లో ఉంది. నిపుణుల మాట ప్రకారం, చార్జింగ్ ప్రారంభంలో ఎక్కువ పవర్ వెళ్లినప్పుడు ఫోన్ కొంత వేడెక్కడం సహజం. కానీ తయారీదారులు సూచించిన వాటేజ్ మేరకే చార్జర్ వాడితే, ఈ వేడి బ్యాటరీకి హాని చేసే స్థాయికి చేరదు. పైగా చాలా స్మార్ట్‌ఫోన్లలో బ్యాటరీ 80 శాతం దాటగానే చార్జింగ్ వేగాన్ని ఆటోమేటిక్‌గా తగ్గించే సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.
ఎక్కువ వాటేజ్ ఉన్న చార్జర్ అంటేనే మంచిదని భావించడం సరికాదు. మీ ఫోన్ ఎంత వాటేజ్ సపోర్ట్ చేస్తుందో తెలుసుకుని, అదే మేరకు చార్జర్ ఉపయోగించడమే ఉత్తమం. అలా చేస్తే బ్యాటరీ మన్నిక కూడా నిలుస్తుంది, ఫోన్ పనితీరుపై కూడా ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. ఫాస్ట్ చార్జింగ్ అనేది సౌకర్యం కోసం మాత్రమే, కానీ జాగ్రత్త లేకుండా వాడితే సమస్యలకు దారి తీసే అవకాశం ఉందన్న విషయాన్ని వినియోగదారులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.