ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు..
ఆరుగురు అధికారులతో అథారిటీ సంస్థ ఏర్పాటు..
దేశంలో వేగంగా పెరుగుతున్న ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ‘ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ అథారిటీని మొత్తం ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు. ఇందులో ఛైర్మన్‌గా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అదనపు కార్యదర్శిని నియమించారు.
ఇక ఎక్స్ అఫీషియో సభ్యులుగా పలు కీలక శాఖల ఉన్నతాధికారులను చేర్చారు. హోంశాఖ సంయుక్త కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి, సమాచార మరియు ప్రసారశాఖ సంయుక్త కార్యదర్శి, యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, అలాగే న్యాయశాఖ కార్యదర్శి ఈ అథారిటీలో సభ్యులుగా వ్యవహరించనున్నారు.
ఆన్లైన్ గేమింగ్ రంగంలో పారదర్శకత, నియంత్రణ, వినియోగదారుల రక్షణ లక్ష్యంగా ఈ అథారిటీ పనిచేయనుంది. గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కార్యకలాపాల పర్యవేక్షణతో పాటు, అక్రమాలు, మోసాలను అరికట్టడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
డిజిటల్ వినోదం విస్తరిస్తున్న ఈ సమయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం గేమింగ్ రంగానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా, వినియోగదారులకు మరింత భద్రత కల్పించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.