- గత 5 ఏళ్ళు జగన్ పోలవరం నిర్వాసితులను ఎందుకు పట్టించుకోలేదు…
- ఈ నెలాఖరుకి డయా ఫ్రం వాల్ పూర్తి చేస్తాం..
Polavaram Updates: ఐదేళ్ల జగన్ అరాచక పాలనలో పోలవరం నిర్వాసితులు పండుగులు చేసుకోవడం మర్చిపోయారని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.. ఉగాది కానుకగా పోలవరం నిర్వాసితులకు 226 కోట్ల రూపాయలు చెక్కును గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా బుధవారం వారి ఖాతాల్లో జమ చేసే విధంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులతో కలసి మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల సంక్షేమం రెండూ తమకు ముఖ్యమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు దిశా నిర్దేశం చేశారన్నారు. వచ్చే ఏడాది 2027 నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. పోలవరం పూర్తయ్యే లోపు గానే నిర్వాసితులకు పునరావాసం, పరిహారం చెల్లించే విధంగా ప్రణాళికతో పని చేస్తున్నామన్నారు.
2014-19 లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే 700 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గడిచిన 21 నెలలలో 1940 కోట్లు నిర్వాసితులకు అందజేసి, వారికి అండగా నిలిచిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. 2025 సంక్రాంతికి 800 కోట్లు, దీపావళికి 914 కోట్లు, 2026 ఉగాది సందర్భంగా నేడు 226 కోట్లు వెరసి 1940 కోట్లు నిర్వాసితుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. జగన్ పాలనలో నిచ్చేస్టులు అయిపోయిన నిర్వాసితులు నేడు మళ్ళీ నిండు ఆనందంతో కనిపిస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకి 2014-19 తెలుగుదేశం హయాంలో కేంద్ర నిధులు సకాలంలో రాలేకపోయినా అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ నుంచి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి, పనులు సాగించిందన్నారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు చేసిన 3880 కోట్లు జగన్ హయాంలో కేంద్రం రియంబర్స్ చేయగా ఆ నిధులను, ప్రాజెక్టు పనులకు కేటాయించలేదు. నిర్వాసితులకు పరిహారము చెల్లించకుండా ఎక్కడికి మళ్ళించారో ఏం చేశారో కూడా తెలియకుండా చేశారని రామానాయుడు విమర్శించారు.
మాట్లాడితే నా ఎస్సీలు, నా ఎస్టీలు అని మొసలి కన్నీరు కార్చే జగన్మోహన్ రెడ్డి నిర్వాసితులు అత్యధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ సోదరులకు చేసిన అన్యాయం అంతా అంతా కాదన్నారు. ఈ విషయమై జగన్ రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా పోలవరం నిర్వాసితులకు సమాధానం చెప్పాలని మంత్రి నిలదీశారు.. అప్పటివరకు పోలవరం ఊసెత్తే అర్హత జగన్ కి లేదని ఆయన అన్నారు. ఈ ఉగాది కానుకగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం నిర్వాసితులకు మరో కానుక ప్రకటించారని రామానాయుడు చెప్పారు. పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఇప్పటివరకు ఇంటి నిర్మాణానికి 2,85,000 మాత్రమే చెల్లించేవారు అన్నారు. ఈ మొత్తాన్ని 3,57,000 కు పెంచారని ఆయన చెప్పారు. అలాగే ఓ టి ఎస్ కింద.. అంటే కాలనీలో ఐదు సెంట్లు ఇళ్ల స్థలం అక్కర్లేకుండా వేరే చోటకి వెళదాం అనుకున్న వారికి అదనంగా ఇచ్చే లక్ష రూపాయలను రెండు లక్షలకు పెంచినట్లు కూడా మంత్రి చెప్పారు. దీంతో ఓ టి ఎస్ మొత్తం 5.57 లక్షలకు పెంచిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అని అన్నారు.