స్థానిక ఎన్నికల్లోనూ అవకాశాలు..
దేవస్థాన బోర్డుల్లో సభ్యత్వం హామీ..
కుప్పం/చిత్తూరు: కురుబ సమాజానికి రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీనే అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత-జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కురుబలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని ఆమె తెలిపారు.
చిత్తూరు జిల్లా కుప్పం మండల కేంద్రంలో నిర్వహించిన కోడెళ్ల రాయస్వామి ఉత్సవాల్లో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, ఈ ఉత్సవంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. గత ఏడాది జరిగిన ఉత్సవాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆలయ అభివృద్ధి కోసం సీఎం నిధులు మంజూరు చేసి, మౌలిక వసతులు కల్పించారని తెలిపారు. దీనికి కురుబ సమాజం తరఫున సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి కురుబలకు రాజకీయ అవకాశాలు ఇస్తోందని మంత్రి చెప్పారు. 2014 ఎన్నికల్లో కురుబలకు రెండు ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చి గెలిపించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. తనలాంటి కురుబ వర్గానికి చెందిన వ్యక్తికి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం ఇవ్వడం కూడా అదే ప్రోత్సాహానికి నిదర్శనమన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కురుబలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారికి టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే దేవస్థానాల పాలక మండళ్లలో కూడా కురుబలకు సభ్యులుగా అవకాశాలు కల్పించనున్నట్లు సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. గుడికట్ల పూజారులకు త్వరలో గౌరవ వేతనాలు అందించనున్నామని వెల్లడించారు. గుడికట్ల దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
విద్యతోనే సమాజం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లగలదని మంత్రి సవిత పేర్కొన్నారు. కురుబలు తమ పిల్లలకు మంచి విద్య అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్న ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాత్రను ప్రస్తావించారు. పేదలు, బీసీల విద్య కోసం ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తోందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని విద్యలో రాణించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్, కురుబ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జునతో పాటు అనేక మంది సామాజిక ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.