సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రాంతంలో జరిగిన సిగాచి ఫార్మా పరిశ్రమ ప్రమాద బాధితుల పరిహారం విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారం పంపిణీలో జాప్యం, స్పష్టత లేకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు ఎంత పరిహారం చెల్లించారో, ఇంకా ఎంత ఇవ్వాలనుకుంటున్నారో, ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టంగా తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధితుల జీవితాలతో చెలగాటం ఆడేలా ప్రభుత్వ వ్యవహారం ఉందంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
గతేడాది సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 56 మంది కార్మికులు దుర్మరణం చెందగా, మరో 8 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. అలాగే 28 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, మృతులు మరియు గాయపడిన బాధితులకు తక్షణమే సరైన పరిహారం అందించాలని కోరుతూ బాబురావు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం, “పరిహారం ఎంత ఇస్తామని చెప్పారు? ఇప్పటివరకు ఎంత ఇచ్చారు? అసలు ఎప్పుడు బాధితుల ఖాతాల్లో జమ చేస్తారు?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. పరిహారం అంశంలో ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని, బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.
పరిహారం పంపిణీకి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, సిగాచి ఫార్మా కంపెనీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసులో ఈపీఎఫ్ హైదరాబాద్ రీజినల్ కమిషనర్, ఈఎస్ఐ డైరెక్టర్, రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలిని సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. కంపెనీ ప్రకటించిన పరిహారం వివరాలతో పాటు, చట్టప్రకారం బాధితులకు అందాల్సిన అన్ని ప్రయోజనాల వివరాలను కూడా సమర్పించాలని సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చింది. బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ అంశాన్ని సీరియస్‌గా పర్యవేక్షిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.