తేదీ 11-02-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 11 ఫిబ్రవరి 2026 (బుధవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీమతి కావలి ప్రతిభాభారతి గారు (సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్)
2. శ్రీమతి తేజస్వి పొడపాటి గారు (ఏపీ కల్చరల్ కమిషన్ చైర్మన్)
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన "ప్రజా వేదిక" కార్యక్రమంలో ప్రజల నుండి వినతుల వెల్లువ కొనసాగింది. పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్ రెడ్డి సుబ్రమణ్యం మరియు ఏపీ బొందిలి కార్పొరేషన్ చైర్మన్ డి విక్రమ్ సింగ్ ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన బాధితులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలు, రాజకీయ వేధింపులు మరియు అధికారుల నిర్లక్ష్యంపై తమ గోడును వెళ్లబోసుకున్నారు. నాయకులు ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రధానంగా ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన నండూరి రాజేశ్వరి అనే మహిళ తన భూ సమస్యను నేతలకు వివరించారు. తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన 9.88 ఎకరాల భూమిలో 1.88 ఎకరాలను వైసీపీ మాజీ మండల కన్వీనర్ ఉడుముల శ్రీనివాసరెడ్డి అధికారులపై ఒత్తిడి తెచ్చి అక్రమంగా ఆన్‌లైన్ చేయించుకున్నారని ఆమె వాపోయారు. అలాగే కాకినాడకు చెందిన దుర్గ అనే బాధితురాలు, వైసీపీ నేత అయిన తన కన్నతల్లి రాజకీయ బలంతో తనను కట్టుబట్టలతో ఇంటి నుండి గెంటివేసిందని, పోలీసులు కూడా తనకు న్యాయం చేయలేదని కన్నీటిపర్యంతమయ్యారు.
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు చెందిన కృష్ణప్ప తన తండ్రికి ప్రభుత్వం పట్టాగా ఇచ్చిన భూమిని రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కై వేరే వ్యక్తుల పేరు మీదకు మార్చారని ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన రైతు దారపనేని చెన్నయ్య కూడా తనకు 1974లో వచ్చిన డి-పట్టా భూమిని ప్రస్తుతం సంబంధం లేని వ్యక్తుల పేర్లపై రికార్డుల్లో నమోదు చేశారని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదని, తమ జీవనాధారమైన భూమిని కాపాడాలని వీరంతా నేతలను వేడుకున్నారు.
కడప జిల్లా సిద్దవటం మండలానికి చెందిన ఓబులేసు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా తమ సాగు భూముల్లో జెసిబిలతో పనులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన వెంకటేశ్వర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని, తప్పుడు కేసులతో తమను వేధిస్తున్నారని వివరించారు. భూ సమస్యలతో పాటు పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణం మరియు ఉద్యోగ అవకాశాల కోసం కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వినతులు సమర్పించారు.
వచ్చిన ప్రతి విన్నపాన్ని స్వీకరించిన రెడ్డి సుబ్రమణ్యం మరియు విక్రమ్ సింగ్, సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో సామాన్యులకు న్యాయం జరుగుతుందని, అక్రమార్కులకు తావులేదని స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితులకు సత్వర పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు.
వచ్చిన అర్జీలను పరిశీలించి, సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని నాయకులు ఆదేశించారు. నాయకులు సామాన్య ప్రజలకు మరియు కార్యకర్తలకు అందుబాటులో ఉండి, వారికి భరోసా కల్పించడంతో ఈ కార్యక్రమం సంతృప్తికరంగా ముగిసింది.