- ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్: భక్తుల రక్షణే ప్రథమ కర్తవ్యం..
- మంత్రులు, అధికారులకు కీలక బాధ్యతలు…
Sivaratri Arrangements AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పటికీ, భక్తుల సౌకర్యాల విషయంలో రాజీపడకూడదనే ఉద్దేశంతో అక్కడి నుంచే మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీశైలంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన శివాలయాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఎక్కడా లోటుపాట్లు కూడా తలెత్తకూడదని సీఎం కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.
శ్రీశైల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని గుర్తించిన సీఎం చంద్రబాబు.. క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా వారికి అవసరమైన వసతి సౌకర్యాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శివరాత్రి నాటికి రద్దీ ఇంకా పెరుగుతుంది.. ఇప్పటి నుంచే పటిష్టమైన కార్యచరణ ఉండాలి అని సీఎం స్పష్టం చేశారు. అధికారులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని భక్తుల రక్షణే ప్రథమ కర్తవ్యంగా ఉండాలని సూచించారు.
మంత్రులు అధికారులకు దిశానిర్దేశం
ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోం మంత్రి వంగలపూడి అనితలకు ముఖ్యమంత్రి కీలక బాధ్యతలు అప్పగించారు. దేవస్థానాల్లో ఏర్పాట్లు, భక్తుల వసతులను మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ కు సూచిస్తూ.. అన్ని ప్రభుత్వ విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేసేలా ఇప్పటి నుంచే నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. డీజీపీతో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, క్యూలైన్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.
స్వామివారి భక్తులకు గౌరవం ఇవ్వాల్సిందే..
ఎంతో నిష్ఠతో మాలధారణ చేసి పాదయాత్రల ద్వారా మైళ్ల దూరం నుంచి వచ్చే శివభక్తుల పట్ల అధికారులు, సిబ్బంది ఎంతో మర్యాదగా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భక్తులను అగౌరవపరిచేలా ఎవరు వ్యవహరించినా సహించేది లేదు.. వారు ఎంతో కష్టపడి స్వామి దర్శనం కోసం వస్తారు, వారికి మనోధైర్యాన్ని ఇస్తూ సేవలు అందించాలి అని చంద్రబాబు సున్నితంగా హెచ్చరించారు. ఆలయాల్లో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని, భవిష్యత్తులో కూడా తిరుమల తరహాలో శ్రీశైలాన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.