- కేటీఆర్ తనపై తప్పుగా మాట్లాడి ఉండరన్న పవన్ కల్యాణ్..
- Politics: మళ్లీ కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటామని స్పష్టీకరణ..
Pawan Kalyan: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనను ఉద్దేశించి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసి ఉండరని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తనకు కేటీఆర్‌తో మంచి సోదరభావ సంబంధం ఉందని, అనేక సందర్భాల్లో ఇద్దరం కలిశామని, తమ మధ్య పరస్పర ఇష్టాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా, కేటీఆర్ వ్యాఖ్యల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు పవన్ ఈ విధంగా స్పందించారు.
"కేటీఆర్ గారు ఏమన్నారో నేను పూర్తిగా చూడలేదు. కానీ, నాకు తెలిసి ఆయన పొరపాటు మాటలు మాట్లాడరు. బహుశా ఆయన నా పూర్తి వ్యాఖ్యలు చూడలేదేమో. ఆయన ఒక సరైన దృక్పథంతోనే మాట్లాడి ఉంటారని అనుకుంటున్నా. కొన్నిసార్లు విషయాలను చిలికి చిలికి గాలివానలా మారుస్తుంటారు. దీనిపై అంతకుమించి ఏమీ లేదు" అని పవన్ కళ్యాణ్ వివరించారు.
విధానపరమైన అంశాల్లో భేదాభిప్రాయాలు ఉండటం సహజమని, అయితే తమ వ్యక్తిగత సంబంధం వేరని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదంపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని, తామిద్దరం ఎప్పుడైనా కలిసినప్పుడు దీని గురించి సరదాగా మాట్లాడుకుంటామని పవన్ కల్యాణ్ తేలికగా వ్యాఖ్యానించారు.